Monday, December 1, 2014

కోయంబతూర్ వెళ్ళింది జాతీయ స్థాయి పార్టనర్స్ సమావేశానికి.

https://www.facebook.com/satyavati.kondaveeti/posts/599896830117040

కావ్యేషు నాటకం రమ్యం...













మీటింగులు..పనులు....భూమిక పత్రిక పని...హెల్ప్ లైన్ కేసులు...
ఎంత వొత్తిడి ఉన్నా 5.30 అయ్యేసరికి రవీంద్ర భారతి మీద వాలిపోవడం...
తొలిరోజు గీత...మలిరోజు మూడో రోజు నాతో ప్రశాంతి...ప్రాణనేస్తాల తో కలిసి రసాస్వాదనం...
వనమాలి అనే సాంస్కృతిక సంస్థ ...వీటి బాధ్యులు దేవి...శాంతారావ్...మహేష్.
మూడు రోజులపాటు 5.30 నుంచి 10.30 దాకా నాటకం నన్ను పూనింది...
మొదటి రోజు రాయలసీమ పాలెగాడు నరసిమ్హా రెడ్డి వీరోచిత తొలి స్వాతంత్ర్య పోరాట స్పూర్తి...
రెండో రోజు పుల్లరి పన్నును ధిక్కరించిన కన్నెగంటి హనుమంతు అద్భుత చరిత్ర...
ఈ రెండు నాటకాలు స్టేజిని సర్వాంగ సుందరంగా అలంకరించి సీను సీనుకి స్టేజి అలంకరణ మారుస్తూ ప్రదర్శించారు.
మూడో రోజు ఎవరి పేర్లు తలిస్తే రక్తం ఉప్పొంగుతుందో, ఆదివాసుల కోసం అస్త్రాలను బ్రీటీష్ వారికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టి ఉద్యమించి పోరాడి వీరమరణం పొందారో వారు...జోడేఘాట్ వీరుడు కొమరం భీం...మన్యం శూరుడు అల్లూరి సీతారామరాజు...
ఈ రెండు నాటకాలని వీధి నాటక రూపం లో మహాద్భుతంగా ప్రదర్శించారు.
ఆ నాటకాలను చూస్తూ పొందిన ఉద్వేగం ...రసాస్వాదనం మరే ప్రక్రియలోను పొందలేము.
కళ్ళ ముందు కనబడే పాత్రలతో మమేకమై ఏడుస్తాం..నవ్వుతాం...ఈలలేస్తాం.
ఈ అనుభూతిని పొందాలంటే నాటకం చూడాల్సిందే.
ప్రతిస్పందన చెప్పమని నిర్వాహకులు కోరినప్పుడు నేను చిన్న కొమరం భీం పక్కన నిలబడి నాకు ఈ ట్రూప్ తో కలిసి నాటకాలేసుకుంటూ తిరగాలని ఉంది అని చెప్పాను.
ఈ సందర్భంగా దేవి ఒక ప్రపోజల్ పెట్టింది.
తదుపరి ప్రాజెక్ట్ గా నాయకురాలు నాగమ్మ...చిందు ఎల్లమ్మల జీవితాలను నాటకీకరించాలని ఉందని...ఆర్ధికంగా సహకరించడానికి ఎవరైనా ముందుకొస్తే మార్చి 8 నాటికి గాని...ఏప్రిల్ 14 అంబేద్కర్ పుట్టిన రోజున కానీ ప్రదర్శించవచ్చు అని చెప్పింది.
ముఖ్యంగా చిందు ఎల్లమ్మని రంగం మీదకి తేవాలని ప్రయత్నం అంది.
నేను వెంటనే చెప్పాను నేను కొంత సహకరిస్తాను మితృలందరినీ అడుగుదాం అని హామీ ఇచ్చాను.
కార్యక్రమం పూర్తయ్యాకా ప్రశాంతిని వాళ్ళింట్లో దింపడానికి వెళ్ళినప్పుడు దీని గురించే చర్చించాం.
మితృలారా!!! మీకు ఏమైనా ఐడియాలుంటే చెప్పండి.
చిందుల ఎల్లమ్మ కధని నాటకీకరించి ప్రదర్శించడానికి అయ్యే ఖర్చు ఎంతో ఖచ్చితంగా ఇంకా తెలియదు.
కానీ ఆ సొమ్మును సేకరించగలం అనే నమ్మకం నాకు ప్రశాంతికి కలిగింది.
మీరు ఏమంటారు ఫ్రెండ్స్....

Thursday, October 2, 2014

అలజడులు...నా అంతరంగపు ఆనవాళ్ళు

నా జీవితంలో
ప్రేమకే స్థానం
పూజకి లేదు
.
నా చేతులు
పాటుపడతాయ్
ప్రార్ధన చెయ్యవు
.
నా కోరికలు
నేను తీర్చుకోవాల్సినవే
ఏ శక్తి,భక్తి తీర్చేవి కావు
.
నా సాష్టాంగ ప్రణామం
నా కన్నవాళ్ళకే
కపట సన్నాసులకు కాదు
.
నాకు జీవితమంటే
అలుపెరుగని పోరాటమే
అర్ధింపులు,వేడికోళ్ళు అస్సలుండవ్
.
నా ఇంట్లో పూజ గదులుండవ్
ప్రేమ గదులుంటాయ్
పుస్తకాల గదులూ ఉంటాయ్
.
నన్ను నేను సమర్పించుకునేది
నా లోని ఆత్మవిశ్వాశానికే
ఏ అతీత శక్తికో ,మరేదో అదృశ్యశక్తికో కానే కాదు
ప్రజలు పోరాటాలు మర్చిపోవాలంటే
గుళ్ళవేపు తోలెయ్యడమే
.
భూములు దురాక్రమించాలనుకుంటున్నావా
ఏం ఫర్వాలేదు అక్కడో గుడి కట్టేయ్
.
ప్రజల కళ్ళు గుళ్ళ మీద
నీ కళ్ళు భూముల మీద
.
ఆధునిక ఆదాయ వనరు
అడ్డదిడ్డంగా కట్టేసిన గుళ్ళు
.
అమ్మ గుళ్ళంటూ కట్టి
చూపించేది మళ్ళీ అంగాంగ ప్రదర్శనే
.
ప్రభుత్వ కార్యాలయాల్లో పూజలా???
సెక్యులరిజం జిందాబాద్
.
గవర్నమెంటాఫీసులు ప్రలందరివీ
పూజలు చేసే హక్కు ఎవ్వరికీ లేదు
.
పూజ వ్యక్తిగతం
పబ్లిక్ ప్లేస్ లో గెంతక్కరలేదుగా !!
.

Tuesday, April 1, 2014

నన్ను ఆవహించిన ఆదిలాబాద్‌ అడవి

ఆదిలాబాదు అడవుల మీద మోహం ఈనాటిదా? కాదు కాదు…. చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. సమతా రోషిణి ఆ జిల్లాలో పనిచేసినపుడు… మనోరమ ఆదిలాబాదు కలెక్టారాఫీసులో ఉద్యోగం చేసినపుడు…. చాలా చాలా అనుకున్నాను. ఎన్నోసార్లు వాళ్ళను అడిగాను. 

20140114_040029
ఆదిలాబాదు ట్రిప్‌ వేద్దాం… వివరాలు సేకరించండి అంటే…. ఎవ్వరూ వినలేదు. నా కోరిక అలాగే దాక్కుని వుండిపోయింది. ఆ అడవి మీద మోహం మరింతగా పెరిగిపోయింది. కుంతల జలపాతం కవ్విస్తూనే వుంది.
అమృతలత పరిచయం… అది స్నేహరూపం దాల్చాక… ఇటువేపు రైటర్స్‌ ట్రిప్‌ వెయ్యండి… అన్నీ నేను చూసుకుంటాను అన్నపుడు మనసు మూలల్లో ముడుచుకుని కూర్చున్న కోరిక ఆఘమేఘాల మీద బయటకు ఉరికొచ్చింది. ఆయా ప్రాంతాల గురించి తెలిసిన అమృత ఆర్గనైజ్‌ చేస్తానంటే ఇంకేం కావాలి? అక్కడ పనిచేస్తున్న ప్రశాంతి సపోర్ట్‌ వుండనే వుంది. ఏ ప్రాంతం నుంచి… ఏ ప్రాంతానికి వెళ్ళాలి? రూట్‌ ఏమిటి? ఏ గ్రామం విజిట్‌ చెయ్యాలి? లాంటి విషయాలన్నీ మొత్తంగా వాళ్ళిద్దరికీ అప్పగించేసి ఆదిలాబాదు అడవి గురించి కలలు కనడం మొదలు పెట్టాను.
భూమిక టీమ్‌ చకచకా పనులన్నీ పూర్తి చేసారు. బస్సు మాట్లాడారు. ట్రిప్‌కి వస్తామన్న వాళ్ళతో అసంఖ్యాకంగా మెసేజ్‌ల రూపంలో, మాటల రూపంలో మాట్లాడారు. వస్తామన్న వాళ్ళ లిస్ట్‌ ప్రతిరోజూ మారుతూ… చివరికి 25 మంది మిగిలారు. 28 సీటర్‌ బస్సు మాట్లాడుకుని 21 సాయంత్రం నాలుగింటికి ఆదిలాబాదు ప్రయాణం మొదలైంది. గీత కండక్టర్‌ సీటులో కూర్చుని ప్రయాణపు కథని సజావుగా నడిపించింది. నేను, ప్రశాంతి అటు ఇటూ తిరుగుతూ… డ్రైవర్‌కి సూచనలిస్తూ చాలా హడావుడిగా వున్నట్టు కనబడ్డాం.
మూడు రోజుల ట్రిప్‌లో చూడాల్సిన ప్రదేశాలు, చెయ్యాల్సిన పనులూ నా మనసులో మెదులుతూనే వున్నాయి కానీ… నిజానికి ఈ ట్రిప్‌ని ఆర్గనైజ్‌ చెయ్యడం మినహా నేను చేసిందేమీ లేదు. ఆదిలాబాదు ట్రిప్‌లో అసలు కథానాయికలు… అమృత, గీత, ప్రశాంతి. ఈ ముగ్గురూ కలిసి ఈ ప్రయాణాన్ని నల్లేరు మీద నడకలా తీర్చిదిద్దారు. మేమంతా నిజామాబాద్‌లో దిగిన దగ్గర నుండి అమృత & బృందం వారి ఆత్మీయ ఆదరణలోకి వెళ్ళిపోయాం. ఎక్కడా ఎవ్వరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా… అమృత చేసిన ఏర్పాట్లు అనితరసాధ్యం. ఆమె మనసులాగే ఆమె ఇల్లు అతి విశాలం. మేం 25 మందిమి.. ఆమె ఫ్రెండ్స్‌… అందరం ఆ ఇంట్లో యిమిడిపోయాం. ఇల్లంతా ఆగమాగం చేసాం. కబుర్లు… నవ్వులు… కేరింతలు…. తుళ్ళింతలు ఆ ఇంటి గోడల్లో యింకిపోయి వుంటాయి.
అర్థరాత్రి దాకా ఆడి, పాడి… నిద్రకు బై బై చెప్పినా… కోడి కుయ్యక ముందే పోలోమని లేచిపోయారందరూ. అంతకు ముందే అమృతతో కలిసి చూసాను కదా… కధలు కధలుగా పొచ్చరను వర్ణించడంతో అందరిలోను ఉత్సాహం ఉరకలు వేసింది. ఆ జలపాతాన్ని ఎప్పుడెప్పుడు వాటేసుకోవాలా… ఉవ్విళ్ళూరుతూ బిలబిల మంటూ బస్సెక్కేసారు. అప్పటికే రెండేసి కప్పులు నురగలు కక్కే కాఫీ తాగి వున్నారేమో… హుషారు… హుషారుగా కబుర్లలో పడ్డారందరూ.
శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు… ఎత్తైన ఆ గట్టెక్కలేక… అటువైపు వెళుతున్న ఓ మోటార్‌ బైకిస్ట్‌ని ఆపి… లిఫ్ట్‌ అడిగి వెళ్ళిపోతుంటే వెనక నుంచి నవ్వుల పువ్వులు నా మీద రాలుతూనే వున్నాయి. కళ్ళెదురుగా గోదావరి… గుండె ఉప్పొంగింది. ఆ ప్రత్యూషవేళ…. ఉదయిస్తున్న భానుడి బంగారు కిరణాలు ప్రతిఫలించి గోదారి మిల మిలా మెరిసిపోయింది. అందరి కెమేరాలు క్లిక్‌ క్లిక్‌ మంటూనే వున్నాయి. అక్కడ పార్క్‌ చేసి వున్న పోలీసోళ్ళ బైకు మీద కూర్చుని నేను ఫోటోకి పోజిచ్చాను. బ్యారేజ్‌ మీదికి కడదాకా వెళ్ళొచ్చిన గీత బృందం… రిజర్వాయర్‌ గోడ మీదెక్కి నడుస్తూ వచ్చిన ప్రశాంతి గ్యాంగ్‌ మాతో వచ్చి చేరారు. ఈ లోపు సెక్యూరిటీ వాళ్ళని రిక్వెస్ట్‌ చేసి బస్సును పైకి తెచ్చాం. మాతో రమ్మని పిలవనందుకు అలిగి, ముఖం కందగడ్డలా చేసుకున్న సూర్యుడు నిక్కి నిక్కి పైకొచ్చి మావేపు ఎర్రెర్రగా చూస్తుండగా మేము బస్సెక్కి పొచ్చర వేపు సాగిపోయాం.
పొచ్చర…. ఆ జలపాత సంగీతం వింటూ…. కంటపడగానే అందరూ బిల బిల మంటూ అటు జారిపోబోయారు… మా కంటే ముందు వేడి వేడి టిఫిన్ల క్యారియర్లతో అక్కడ మాటేసిన అమృత వలేసి అందరినీ వెనక్కిలాగి… బుద్ధిగా టిఫిన్‌ తినండి…. ఆ తర్వాత మీ ఇష్టం… అనడంతో అందరం బుద్ధిగా కూర్చుని ఆవురావురుమంటూ తిన్నాం. అది టిఫిన్‌ కాదు. భోజనమే… అన్ని అయిటమ్స్‌ వున్నాయి. కడుపు నిండింది కదా! జలపాతం మీదికి ఉరికేసారందరూ. ఏమి నవ్వులు… ఏమి కేరింతలు… ఎవ్వరికీ వయస్సు గుర్తు రాలేదు… బాల్యంలోకి వెళ్ళిపోయారు. జలపాతాన్ని వాటేసుకుని… తొలి ప్రేమనాటి తియ్యదనాల్లోకి…. గాఢస్నేహపు గాఢానుభూతుల్లోకి ఇంకేవో తెలియని ఉద్వేగాలు ఊపేస్తుంటే…. జలపాత కౌగిలి నుంచి విడివడలేక… గడియారం ముల్లు గుచ్చుతుంటే పొచ్చరకు ప్రేమగా వీడ్కోలు పలికి పోలోమంటూ బస్సెక్కి మొండిగుట్టకి సాగిపోయాం.
మొండిగుట్ట… పేరు మహా మొరటుగా వుంది కానీ అదో తపోవనం. కోళ్ళు, లేళ్ళు… చుట్టూ కొండలు… అడవి…. ఆ అడవి అంచులో అందమైన లోయ. అడవి మధ్యలో అందంగా వెలసిన ఆ ఇంట్లో వుండే అక్క చెల్లెళ్ళు..కల్పన, కరుణ డొక్కా సీతమ్మకి సొంత చెల్లెళ్ళ లాగా మాకు విందు భోజనాలేర్పాటు చేసారు. మేమెవరమని… అంతకు ముందు మమ్మల్ని చూసింది లేదు… అయినా ఎన్నో సంవత్సరాల బాంధవ్యం పెనవేసిన చందాన మాకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసారు. విందు భోజనాలు మాత్రమేనా… గానాబజానా… ఎంటర్‌టైన్‌మెంట్‌… నాటకాల ప్రదర్శన… ఆ నాటకాలేసిన వాళ్ళు సామాన్యులనుకునేరు… మహామేధావులు… అమృతగారి విద్యాసంస్థల్లో పనిచేసే ప్రిన్సిపాళ్ళు, హెడ్‌మిస్ట్రెస్‌లు, లెక్చరర్లు…. వాళ్ళంతా ముఖాలకు రంగులేసుకుని తమ నటనలతో మమ్మల్ని ఆలరించారు. వీటన్నింటి సూత్రధారి అమృత… మమ్మల్ని అడవి గర్భంలో వున్న గోండు గ్రామానికి తీసుకెళ్ళడానికి రెండు ట్రాక్టర్లను ఏర్పాటు చేసారు. భోజనాలయ్యాక… దూరంగా కనిపిస్తున్న అడవి నన్ను రా రమ్మని పిలవసాగింది. నా కాళ్ళు అసంకల్పితంగా అటువేపు నడవసాగాయి. వెనక ఎవరో పిలుస్తున్నా పట్టించుకోకుండా నడుస్తున్నాను. అడవిలోకి వచ్చేసాను. వెనక ”అమ్మూ! ఆగు… ఎక్కడికి వెళుతున్నావ్‌?” అంటూ ప్రశాంతి వస్తోంది. ”వొక్కదానివి ఎక్కడికెళ్ళి పోతున్నావ్‌” అంటూ చెయ్యి పట్టుకుంది. ”ఈ అడివి, ఆ లోయ చూద్దామని వచ్చా” అన్నాను. ఇద్దరం కాసేపు లోతైన ఆ లోయని చూసి వెనక్కి వచ్చేసాం.
అప్పటికి ట్రాక్టర్లు రెడీ అయ్యాయి. దాదాపు నలభై మందిమి రెండు ట్రాక్టర్లలో సర్దుకున్నాం. నేను డ్రైవర్‌ పక్కన కూర్చుందామని ప్రయత్నిస్తే ”వద్దు. కుదుపులకి పడిపోతారని” నిరుత్సాహపరిచారు. కాళ్ళు జాపుకొను జాగా లేకుండా ఒకరిని ఒకరం రాసుకుంటూ కూర్చున్నాం. దట్టమైన అడవి మధ్య నుంచి, రాళ్ళమీద, గుట్టల మీద, వాగుల్లోంచి మా ట్రాక్టర్‌ ప్రయాణించింది. అందరం గోలగోలగా మాటలు, పాటలు, నిట్టూర్పులు, కాళ్ళ కదుములు కట్టేసిన వాళ్ళ బాధలు…. ఆ సమయంలో నేను మాట్లాడుతున్నా… పాటలు పాడుతున్నా… నా లోపల నాకే అర్థం కాని ఏదో అలజడి మొదలైంది. ‘వనవాసి’ నవలలలోని అడివి లాగా… క్రమక్రమంగా అడవి నన్ను ఆవహించసాగింది. ”అమ్మూ! అలా పైకి చూడు…. పైన ఎంత పచ్చగా వుందో” ప్రశాంతి అన్నపుడు తల పైకెత్తి చూసినపుడు నీలం ఆకాశం లోంచి… వొత్తుగా అల్లుకున్న పచ్చదనం నా మీదికి జారిపడింది. నా శరీరమంతా జలదరించినట్లయింది. ఆ పచ్చదనం నా కళ్ళల్లోంచి నా గుండెల్లోకి ఇంకిపోయింది.
వయ్యారాలు పోతూ… ఊగిసలాడుతూ మా ట్రాక్టర్‌ బుర్కరేగడి చేరింది. ఆ గోండుగూడెం… ఆ ఆదివాసుల అమిత ప్రేమ… అమాయకత్వం… నగరాల నుంచి వచ్చిన మాయ మనుషుల కోసం గూడెమంతా అలంకరించి… నృత్యాలు చేసి… ఆలరించిన విధం మమ్మల్ని అపరాధ భావానికి గురి చేసింది. అందరి సంగతి నాకు తెలియదు కానీ… నాకు వాకపల్లి వెళ్ళినప్పటి వేదన పునరావృతమైంది. అడవి గర్భాల్లో ఏ సౌకర్యాలకు నోచుకోకుండా బతుకుతున్నా… సకల సౌకర్యాలు, సౌభాగ్యాలతో ఓలలాడే నాగరీకులు వెళ్ళినపుడు వాళ్ళు వ్యక్తీకరించే ఆనంద తాండవం, అమాయకపు ఆత్మీయత అబ్బురమన్పించడంతో పాటు… వాళ్ళ ముందు మరుగుజ్జుల్లా మారిపోతాం. ఆ స్వచ్ఛతకి నా లోపల కాలుష్యాలేమైనా వుంటే… మాడి మసై పోవాల్సిందే. ఓ గోండు అమ్మాయి చేతిలోని బీడీని లాక్కుని గుప్పు గుప్పున రింగులొదులుతుంటే అందరూ నోరెళ్ళబెట్టి చూసారు. బీడీ రుచి తొలిసారి అనుభవించిన నేను ”భలే వుంది… బీడి…” అంటే కొంతమంది మిత్రులు ”ఛీ… ఛీ…’ అనడం విని ”రుచి చూస్తే కదా తెలుస్తుంది. చూడకుండా ఎట్లా అంటారు” అని నేను పొట్లాటకి దిగాను.
సంధ్యవేళ గూడెం గూడెమంతా మమ్మల్ని సాగనంపుతుంటే చిరుచీకట్లలో… అక్కడి ఇళ్ళు ఉనికిని కోల్పోయి చీకటిలో కలిసిపోయాయి. సూర్యుడు కూడా నాకక్కడేం పని లేదని పడమటి కొండల్లోకి పారిపోయాడు. ఆ చీకటిలో అడవిలోకి మా తిరుగు ప్రయాణం. అడవి ఎంత ఉద్విగ్నంగా వుందో! వాగులు దాటేటప్పుడు ఓ… అంటూ కేకలు… చీకట్లో ఆ అడవి అందం… ఓ మోహావేశం నాలోపలంతా కమ్మేసింది.
మొండిగుట్టలో ఆనందాశ్రువుల మధ్య అమృత బృందానికి వీడ్కోలు… ఆట… పాట… విందు… చిందులతో అలరించిన మొండిగుట్టకి… అమృత బృందానికి హృదయాలింగనాలతో… మళ్ళీ కలుద్దాం అనే ఆశావహ సందేశాలతో బై బై చెప్పి… మేము ఉట్నూరు అడవుల వేపు సాగిపోయాం. గీత… ప్రశాంతి కలిసి ఉట్నూరు అటవీ అతిధి గృహాన్ని మేముండడానికి ఖాయం చేసారు. గీతకి తెలిసిన ఆర్‌.డి.వో. గెస్ట్‌హౌస్‌లో మమ్మల్ని రిసీవ్‌ చేసుకున్నారు. గీత, నేను ఇక్కడ బుల్లి గిల్లి కజ్జా పెట్టుకున్న సంగతి ఎవ్వరికీ తెలియదు. అదో సరదా! మా స్నేహంలో వున్న సొగసు అదే మరి.
ఉట్నూరు దాటి కెరిమెరి ఘాట్‌ రోడ్‌లోకి ప్రవేశించిన వెంటనే నా లోపల అలజడి తిరిగి మొదలైంది. ఈ ఘాట్‌ రోడ్డు సౌందర్యం గురించి, అక్కడి అడవి అందం గురించి దాన్ని విధ్వంసం చేసిన అంశాల గురించి ప్రశాంతి నాతో ఎన్నో సార్లు ఎంతో ఆవేదనతో చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. ఆ విధ్వంసాన్ని, బోసిపోయిన ఆ రోడ్డుని కళ్ళారా చూసినపుడు నాకు కడుపులో తిప్పినట్టయ్యంది. అడవిని అడ్డంగా నరికేసిన దుర్మార్గం… నా లోపలంతా మంటలాగా మారిపోయింది. దారి మధ్యలో బస్సెక్కిన సాకృబాయిని చూసిన తర్వాత, తన మాటలు విన్న తర్వాత చల్లని నీటి కొలనులో స్నానించినట్టయింది. సాకృ, సరిత ఆదిలాబాద్‌లో పనిచేసే ప్రశాంతి బృందంలోని వాళ్ళే. వాళ్ళ మాటల్ని, పాటల్ని మా బృందమంతా మైమరపుతో వినడం గమనించి… ఈ ట్రిప్‌ విజయవంతమైంది అన్పించింది నాకు.
ఇక్కడి నుండి అందరం ప్రశాంతి సమ్మోహన సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయాం. మెత్తటి స్వరంతో తను మనసు విప్పి మాట్లాడిన మాటలు అందరినీ మంత్ర ముగ్ధులను చేసాయి. తను చూపించిన ఆదివాసీ ప్రపంచం, ఆ మనుష్యుల ఆదరణ, ప్రేమ, ఆత్మీయత, ఆతిథ్యం అందరి గుండెలను తాకాయి. కలలో కూడా దర్శించవీలుకానీ ఊళ్ళనీ, మనుష్యులని వారి ఆదరణని కళ్ళ ముందు ఆవిష్కరించిన ప్రశాంతి అందరి మనసులను గెలుచుకోవడమే కాక… ట్రిప్‌ మొత్తాన్ని ఒక సామాజిక బాధ్యతగా మలిచింది. ఆదివాసీల బతుకు చిత్రాలు, వారి జీవన పోరాటాలు, వారి ఆవాసాలు అతి దగ్గరగా చూసిన మా బృందంలోని రచయిత్రులు తమ కలాలకు పదును పెట్టి అత్యుత్తమ సాహిత్య సృజనకి పూనుకోవాలనే నా ఆశను, నా కోరికను ప్రశాంతి ఇలా సాకారం చేయగలిగింది.
కెరిమెరి ఖాళీ అడివి దాటి, జోడీ ఘాట్‌… కొమురమ్‌ భీమ్‌ విగ్రహ దర్శనం అందరినీ మహోద్విగ్న పరిచింది. ఆదివాసీ గుండె ఘోషని ప్రాణాలొడ్డి విన్పించిన కొమురం భీమ్‌… రగిలించిన స్ఫూర్తి అందరి గుండెలను తాకింది. అక్కడ ఆకాశాన్నంటి విస్తరించిన విప్పచెట్టు ముందు నిలబడి నేను ఫోటో తీసుకుని, విప్ప పానీయం తాగినంత మత్తును పొందాను. అడవులు పట్టి తిరిగినా, ఆదివాసీల ఇళ్ళల్లో తిన్నా… ఎక్కడా గుక్కెడు విప్ప పానీయం దొరకలేదే అని నాకిప్పటికీ అక్కసుగానే వుంది.
మోడి, ఝరి, ఉషేగావ్‌ గ్రామాల గురించి ఆయా గ్రామాల ప్రజల సంస్కారం, సాదర సత్కారాలు, విందు భోజనాలు, చిందేసి అలరించిన వైనాల గురించి మా బృందంలో అందరూ విశేషంగానే రాసారు. ఊరు ఊరంతా మహా సంతోష సంబరాలతో మాకు తిలకాలు దిద్ది, బంతిపూల దండలేసి మేమేదో ఘనకార్యం చేసి వచ్చినట్టు మాచుట్టూ కూర్చుని మాకు భోజనాలు పెట్టిన వైనాలు… ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చినపుడల్లా వాళ్ళల్లా… అంత స్వచ్ఛంగా… అంత తేటగా ఎప్పటికైనా మారగలమా? అది సాధ్యమా? అనిపించి మనసు కలుక్కుమంటుంది. ప్రశాంతి… పూవులో తావిలా, పొగడపూవులో మకరందంలా వాళ్ళతో మమేకమైపోయి, వాళ్ళ బతుకుల్తో కలగలిసిపోయి ప్రశాంత వదనంతో పేరుపేరునా వాళ్ళని పల్కరిస్తూ… గుండెలకు హత్తుకుంటూ కలియతిరిగిన దృశ్యం అందరి మనోఫలకం మీద ముద్రితమైపోయింది. నన్ను అమ్మూ! అని పిలుస్తూ నా జీవితంలో భాగమైపోయిన ప్రశాంతిని చూస్తే నాకు ఎంతో గర్వంగా, గౌరవంగా అన్పించింది! వీడ్కోలు దృశ్యాల విషాదం మా బృందం మొత్తాన్ని కంటతడి పెట్టించింది. ప్రశాంతిని వొదలలేక వాళ్ళు… వాళ్ళని వీడలేక మేము చాలా ఉద్వేగభరితులమయ్యాం. అప్పటికే చీకటి పడిపోయింది. ఎవరి సీట్లలో వాళ్ళు సర్దుకున్నాక… దీర్ఘ నిశ్వాసాల సవ్వడులను మోసుకుంటూ బస్సు వర్నికి బయలుదేరింది.
వర్నిలో బస్సు దిగానో లేదో… అమ్మమ్మా అంటూ నన్ను… ప్రశాంతక్కా! అంటూ తనని చుట్టేసారు పిల్లలు. వాళ్ళ సంతోషం, సంబరాల వెలుగు ఆ రాత్రివేళ… ఆ ఆవరణంతా కాంతుల్ని వెదజల్లింది. వాళ్ళతో ఎక్కువ సమయం గడపలేకపోయామన్న బాధ అందరిలోను వ్యక్తమైంది. నిద్రముఖాలతో పిల్లలు ఉత్సాహంగా ఎన్నో కబుర్లు చెప్పారు. కథలు విన్పించారు. పాటలు పాడారు. స్వయంగా చేసిన చక్కటి గ్రీటింగ్‌ కార్డులు అందరికీ ప్రజంట్‌ చేసారు. ”అమ్మమ్మా! మీకు ప్రశాంతక్కకి గ్రీటింగ్స్‌ ఇవ్వలేదు. మీరు బయటవాళ్ళు కాదు కదా! అందుకని…” అన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అయిష్టంగా అసంతృప్తిగా… అందరూ బస్సెక్కేసారు. అర్ధరాత్రి మా బస్సు హైదరాబాదు రోడ్డెక్కింది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు… కాసేపటికి మాగన్ను నిద్రలోకి జారిపోయారందరూ. ప్రశాంతి… గీత డ్రైవర్‌ నిద్రపోకుండా చాలాసేపు అతనితో కబర్లు చెబుతూ కేబిన్‌లో కూర్చున్నారు.
తెల్లారి నాలుగింటికి బస్సుదిగి ఎవరిళ్ళకి వాళ్ళు మళ్ళిపోవడంతో ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ ట్రిప్‌ ముగింపుకొచ్చింది. ముందే రాసినట్టుగా ఈ ట్రిప్‌ విజయం వెనక ముగ్గురి కృషి, సమయస్ఫూర్తి, నిర్వహణా సామర్ధ్యం పోటీపడి పనిచేసాయి. అమృత, ప్రశాంతి, గీత… ముగ్గురూ కలిసి ఆదిలాబాదు ట్రిప్‌ని మర్చిపోలేని మధురానుభవంగా మలిచారన్నది ముమ్మాటికీ నిజం!
ఈ ప్రయాణం నామీద వేసిన గాఢమైన ముద్ర గురించి కూడా రాయాలనిపిస్తోంది. ఈ విషయం గీతకి, ప్రశాంతికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఆ మూడురోజులూ నాలో ఆనందం కొంత ఆందోళన కొంత… రకరకాల భావాల సమ్మేళనంలో సతమతమయ్యాను. కెరిమెరి అడవి దగ్గర ఆవేశం, ఉద్రేకం.. బుర్కరేగడి గూడెంలో అపరాధభావం, మోడి, ఝరి, ఉషేగావ్‌ గ్రామస్తుల సంస్కారం ముందు చిన్నబోయిన మనస్సు… అభివృద్ధి నామస్మరణలో మునిగితేలే ప్రభుత్వాల నిర్లక్ష్యాల మీద కసి, క్రోధం, ఆదివాసుల నిస్సహాయస్థితి… వర్ని చిన్నారుల భవిష్యత్‌ చిత్రం – ఆదివాసీల, అణగారిన వర్గాల మారని బతుకు చిత్రాలు… నగరాల్లో మనం గడుపుతున్న అహంభావపూరిత, ఆత్మాశ్రయ జీవితాలు… నా మనసులో భిన్న భావాల సంఘర్షణలు… భయానక కలల మోహరింపులు… వెరసి వొళ్ళంతా సలసలా కాగిపోతూ 104 డిగ్రీల జ్వరం కమ్మేసింది.
ట్రిప్‌ నుంచి తిరిగొచ్చిన మూడోరోజు … వొళ్ళు తెలియని జ్వరంతో వొక్కర్తిని ఇంట్లో పడున్నాను. ఆ ఉదయం నాకో భయంకరమైన కలవచ్చి ఉలిక్కిపడి లేచాను. వెల్లికిలా పడుకున్న నా కళ్ళముందు అనంతంగా విస్తరించిన పచ్చదనం. పచ్చని ఆకుల సందుల్లోంచి నీలాకాశం… ఎంతో హృద్యంగా వుంది. హఠాత్తుగా ఎవరివో చేతులు నా రెండు చేతుల్ని పట్టుకుని పైపైకి ఈడ్చుకెళ్ళిపోతున్నాయి. నేను వేలాడిపోతూ…. ఆ చేతుల్ని విడిపించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తూ గట్టిగా అరుస్తున్నాను. నా కళ్ళముందు పరుచుకున్న పచ్చదనం కరిగిపోయి నల్లగా మారిపోయింది. నన్ను ఈడ్చుకెళుతున్న చేతులు నన్ను వొదిలేస్తే నేను దబ్బున కింద పడిపోయాను. గట్టిగా అరుస్తూ నేను మెలుకువలోకి వచ్చాను. ఈ కల నన్ను కుదిపేసింది.
నాకు జ్వరమొచ్చి ఎన్నో సంవత్సరాలైంది. ఎప్పుడొచ్చిందో కూడా నాకు గుర్తులేదు. ఆ రాత్రంతా జ్వరమే… మర్నాడు సాయంత్రం దాకా అలాగే అచేతనంగా పడుకున్నాను. అప్పుడు గీతకి ఫోన్‌చేస్తే వెంటనే వచ్చేసింది. తనొచ్చేసరికి నిజానికి నా వొంటి మీద స్పృహలేదు. నుదిటి మీద చెయ్యేసి ”అమ్మో! ఏంటీ జ్వరం…. నాకెందుకు చెప్పలేదు” అంటూ కన్నీళ్ళు పెట్టుకున్న గీత నన్ను తనతో వాళ్ళింటికి తీసుకెళ్ళిపోయింది. ఆ జ్వరం నుంచి, మానసిక కల్లోలం నుంచి కోలుకోవడానికి నాకు వారం రోజులు పట్టింది. నా మనసులో పెద్ద గాయమైందని నాకు అర్థమైంది. అది బయటకు కనబడని గాయం.
2009 లో విశాఖ ట్రిప్‌లో వాకపల్లి వెళ్ళి వచ్చిన నాటి రాత్రి కూడా నేనిలాంటి మానసిక కల్లోలానికి గురయ్యాను. ఆ రాత్రి వెక్కివెక్కిఏడుస్తుంటే ఓ వైపు గీత మరో వైపు హేమంత నన్ను ఓదార్చారు. గుండెకు హత్తుకున్నారు. హేమంత నా మంచం పక్క కింద పడుకుని నా చేతిని తన చేతిలో వుంచుకుని… నా మనస్సును మరల్చడానికి ఎన్నో సరదా సరదా కథలు చెప్పి నన్ను నవ్వించింది. తన వెచ్చటి స్పర్శ, నా మనస్సు తేలిక పరచాలని చేసిన ప్రయత్నం…. నాకిప్పటికీ ఫ్రెష్‌గా అన్పిస్తాయి. ఆరోజు… ఈ రోజు కూడా గీత స్నేహం…. అలాగే వుంది. హేమంత బెంగుళూరులో వుంది. ఎన్ని సార్లు గుర్తొచ్చిందో!! నా బలం నా స్నేహాలే.
ఆదిలాబాదు అడవి నన్ను ఆవహించి…. నా మనసును కల్లోలపరిచి నన్ను…. మరిన్ని అడవుల్లోకి నడిపించింది. పాడేరు, అరకు అడవుల్లో తిరిగి తిరిగి…. ఒక్కర్తిని రంపచోడవరం…. మారేడుమిల్లి అడవుల్లో తిరగడానికి వెళ్ళిపోయాను. అయినా సరే… అడవి నన్ను పిలుస్తూనే వుంటుంది. నేను ఉద్విగ్నమై, కల్లోలమై మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతూనే వుంటాను.

Saturday, January 4, 2014

తిరగరాయాల్సిన కథలు ఇంకెన్నో తేలాల్సి వుంది


ఆ రోజు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియమ్‌లోకి ప్రవేశించేటప్పుడు మనసులో ఓ చిన్న అసౌకర్యం. అయితే అంతకుముందు గేటు బయట చూసిన వైలెట్‌ కలర్‌ పూలబంతులు ఈ అసౌకర్యాన్ని చాలా వరకు తగ్గించేసాయి.ఆ పూలను చూసాకా కూడా మనసులో చీకాకులు, చింతలు మిగిలివున్నాయంటే మనం సరిగ్గా లేమన్న మాట. అంతకు ముందు అదే దారిలో వచ్చిన భానుజ గానీ, జమున గానీ ఆ పూలను చూడనే లేదు. అలా ఎలా చూడకుండా వుంటారా అని నాకు చాలా ఆశ్చర్యంగా వుంటుంది. వాళ్ళిద్దరిని కళ్ళు మూసుకోమని చెప్పి ఆ పూల చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి కళ్ళు తెరవమని చెప్పినపుడు ఆ పూల సొగసు చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటివి సత్యక్క కళ్ళబడతాయి. అని భానుజ అంటే… అబ్బ! ఎంత బావున్నాయి సత్యా! థ్యాంక్స్‌ అంటూ జమున చటుక్కున నా బుగ్గమీద కిస్‌ ఇచ్చేసింది. నేనదిరిపోయాను. ఈ లోపు ప్రశాంతి వచ్చింది. తను ఆ పూలను ముందే చూసింది. తనని తీసుకెళ్ళబోతుంటే ”అమ్మూ! పువ్వులా? నేను చూసాగా” అంది హాయిగా నవ్వేస్తూ .

నేను రాయబోతున్నది ఈ పూల కథ కాదు. డిశంబరు నాలుగున ప్రశాంతి సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమత సొసైటికి చెందిన మహిళలు ప్రదర్శించిన నృత్యరూపకం ”తిరగరాసిన కథ” గురించి. ఈ నృత్య రూపకాన్ని ఇంతకు ముందు మహిళా సమత సొసైటి ఇరవై ఏళ్ళ ప్రస్థానపు సంబరాలవేళ నిస్సియట్‌లో చిన్న వేదిక మీద ప్రదర్శించినప్పుడు చూసాను. ఆ సంబరాల నిర్వహణలో తలమున్కలుగా వున్న ప్రశాంతితో కలిసి చూసాను. హడావుడిగా చూసాను. మనసు మొత్తం లగ్నం కాకుండా చూసాను. అందుకే ఆ రోజు కలగని ఉద్వేగం, డిశంబరు నాలుగున చూసినప్పుడు నన్ను ఊపేసింది. ఎన్నోసార్లు కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. శరీరమంతటా కమ్మిన వేడి సెగలు, గుండెల్లోంచి తన్నుకొస్తున్న ఆగ్రహజ్వాలలు. దాదాపు ఇరవై మంది పైనే చదువు నేర్వని, గ్రామీణ, పేద సంఘం స్త్రీలు, చదువుకుంటున్న పిల్లలు, మహిళా సమతలో పని చేస్తున్న టీమ్‌ సభ్యులు ఓ గంటన్నరపాటు ఆడిటోరియమ్‌ని, ప్రేక్షకుల కళ్ళని ఆక్రమించుకున్నారనే చెప్పాలి. గజ్జెకట్టిన పాదాల లయాత్మక కదలికలు గుండెల మీదే కదిలిన ఫీలింగ్‌. గుండెలయలో కలగలిసిపోయిన మువ్వల సవ్వడులు. కన్నార్పనీయని తాదాత్మ్యత…
వాళ్ళు చెప్పిన రేణుక ఎల్లమ్మ కథ, ఆ కథను మొదలుపెట్టన తీరూ, ముందుకు నడిపించిన తీరూ, ఓ అర్థవంతమైన ముగింపు ఇచ్చిన తీరూ.. నేను రాయడం కాదు. ప్రతి వొక్కరూ చూసితీరాలి. అడవిలో హాయిగా స్వచ్ఛంగా, తేటనీటి ఊటలా బతుకుతున్న అడవిబిడ్డల జీవనశైలి… చెట్టూ, చేమా, ఆకూ, అలమూ, పిట్టా, పామూ, సెలయేళ్ళూ, జలపాతాలూ వెరసి… ఆకు పచ్చగా… పచ్చ పచ్చగా బతుకుతున్న గిరి పుత్రికలు. స్వేచ్ఛ ఊపిరిగా, ఎలాంటి కృత్రిమ కట్టుబాట్లు లేకుండా చిక్కటి అడవిలో చిరు సవ్వడి చేసే గాలిలా అతి సహజంగా బతుకుతున్న గిరిజనుల జీవితంలోకి కార్చిచ్చులా ప్రవేశించాడు జమదగ్ని. అడవి బిడ్డలతో పాటు రూపకంలో మమేకమైన ప్రేక్షకులు కూడా ఉలిక్కిపడతారు. అమ్మ తల్లుల్ని, అడవి దేవతల్ని పూజించే చోటులో జమదగ్ని అడవిని నరికి యజ్ఞం మొదలు పెడతాడు. ఒక బీభత్స విధ్వంశానికి బీజం వేస్తాడు. గిరిజన స్త్రీలు వ్యతిరేకిస్తారు. తిరగబడతారు. తన యజ్ఞానికి అడ్డుపడుతూ ఉద్యమిస్తున్న గిరిపుత్రికలను లొంగదీసుకోవడానికి కొత్త పన్నాగం పన్నుతాడు జమదగ్ని. పోరాటనికి నాయకత్వం వహిస్తున్న రేణుకను పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు. అతని మోసపు ఆలోచనలు తెలియని రేణుక, జమదగ్నిని పెళ్ళి చేసుకుంటుంది. వాళ్ళకి ఐదుగురు కొడుకులు పుడతారు. జమదగ్ని తన అసలు ఆలోచనలు అమలు చేయడానికి అడవుల్ని నరికి, యజ్ఞాలు చేసే పనిని తిరిగి మొదలు పెడతాడు. అడ్డుకున్న రేణుకను, మగని మాటకు ఎదురాడిందని, ధిక్కరించిందని తూలనాడి, తన కొడుకుల్ని పిలిచి, వారిలో పెద్దవాడిని తన తల్లి శిరస్సు నరకమని ఆజ్ఞాపిస్తాడు. అతను తిరస్కరిస్తాడు. మిగిలిన కొడుకులు కూడా తండ్రి ఆజ్ఞను పాటించరు, వాళ్ళని బండరాళ్ళు కమ్మని శపిస్తాడు. చివరి కొడుకు పరుశురాముడు తన గొడ్డలితో ఒక్కవేటుతో తల్లి శిరస్సును ఖండించివేస్తాడు.
ఈ మొత్తం సన్నివేశాలను మహిళా సమత కల్చరల్‌ టీమ్‌ మహాద్భుతంగా ప్రదర్శించారు. జమదగ్ని అహంకారం, రేణుక తిరుగుబాటు, ఆమె మరణం ప్రేక్షకుల్లో తీవ్ర భావోద్వేగాలను కల్గించాయి. ఆయా పాత్రల్ని పోషించిన స్త్రీలు ఆ పాత్రల్లో జీవించారు. మాతృస్వామ్య మహాపతన సన్నివేశం నా కంట నీరు పెట్టించింది. పురుషాహంకారానికి, పితృస్వామ్యానికి పోతపోసినట్టున్న జమదగ్ని నా గుండెల్లో అగ్నిని రగిల్చి, వొళ్ళంతా మండించాడు. కన్నతల్లిని కౄరంగా చంపిన పరుశరాముడు మహాపరాక్రమవంతుడని కీర్తించే హిందూమత గ్రంధాలు, స్త్రీల పరంగా ఎంత విషపూరితమైనవో కళ్ళకు కట్టిన సందర్భమది.
‘తిరగరాసిన కథ’ పేరులో మహిళా సమత బృందం ప్రదర్శించిన నృత్యరూపకం ఆహూతులందరి మన్ననలను అందుకున్నది. ప్రదర్శనకి ముందు మహిళా సమత స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ ”ఈ నృత్య రూపకంలో నటించిన వాళ్ళు ప్రొఫెషనల్‌ కళాకారులు కారని, కేవలం నాలుగు రోజులు రిహార్సల్స్‌ చేసారని, ఈ బృందంలో చదువుకున్న వాళ్ళు, చదువురానివాళ్ళు, విద్యార్ధులు, తమ టీమ్‌ సభ్యులు వున్నారని, ఏవైనా లోపాలుంటే క్షమించాలి” అన్నపుడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ప్రదర్శన ముగిసాక వారందరి నటనా కౌశలం చూసాక ప్రేక్షకులు మరింత ఆశ్చర్యపోయారు. చక్కటి నటన, హావభావాలు, నాట్యం, పాటలు ఒకదానితో మరొకటి పోటీపడ్డాయి.
రేణుక ఎల్లమ్మ చారిత్రక పరాజయగాధని తీసుకుని, స్త్రీల పరాధీనత ఏ విధంగా ప్రారంభమైంది, మహా బలవంతులు, ఆత్మవిశ్వాసం పొంగిపొరలిన ఆదిమ స్త్రీలు ఎలా, ఏ విధంగా పురుషాధిపత్య భావజాలంలో ఇరుక్కుపోయారు, పితృస్వామ్యం స్త్రీల మనశ్శరీరాలను ఎలా కబ్జాచేసింది అనే అంశాలను అత్యద్భుతంగా ఈ నృత్యరూపకం రూపుకట్టించింది. ఆదిమ సమాజం నుంచి ఆధునిక సమాజం వరకు పురుషాధిపత్యం ఎంత హింసాయుతంగా స్త్రీలను లోబరుచుకున్నదీ చక్కగా ప్రదర్శితమైంది.
సామాజిక కార్యకర్త దేవి సహకారంతో సమతా బృందం రూపొందించిన ఈ తిరగరాసిన కథని ఓ క్షణం పక్కన పెట్టి, అసలు రేణుక ఎల్లమ్మ కథ పురాణాల్లో ఎలా వుందోచూద్దాం. భర్త ఆజ్ఞాపిస్తే కొడుకు చేతిలో హత్యకు గురైన రేణుక ఎల్లమ్మ ఆంధ్రప్రదేశ్‌తో సహా మరెన్నో రాష్ట్రాల్లో దేవతావతారం ఎత్తింది. గుళ్ళు కట్టి పూజలు చేస్తున్నారు. విష్ణువు అవతారంగా కీర్తించబడే పరుశురాముడు తండ్రి చెప్పాడని తల్లి శిరస్సు ఖండించాడు. రేణుక చేసిన అపరాధమేమిటి? ఎందుకు ఆమె అంత కఠినమైన శిక్షను అనుభవించాల్సి వచ్చింది?
రేణుక జమదగ్ని భార్య. జమదగ్నికి యజ్ఞాలు చేయడమే పని. యజ్ఞానికి అవసరమైన నీళ్ళని ప్రతిరోజూ రేణుక సమీపంలోని సరస్సు నుంచి మోసుకురావాలి. ఐదుగురు కొడుకులుండీ ఈ నీటి చాకిరీ రేణుకే చెయ్యాలి. అది కూడా బట్టీలో కాల్చని మట్టి కుండతో ఆ నీళ్ళు తొణక్కుండా తెచ్చిపోయ్యాలి. కాల్చని కుండ ఎలా నిలుస్తుంది? ఆ మట్టి కుండ నీళ్ళల్లో ముంచగానే కరిగిపోకుండా ఎలా వుంటుంది? అంటే ఇక్కడ రేణుకకి పాతివ్రత్యాన్ని అద్ది, భర్త పట్ల విశ్వాసంతో వుంటుంది కాబట్టి ఆమె పతివ్రత… పతివ్రత కాబట్టి పచ్చిమట్టి కుండలు కూడా నీళ్ళలో విచ్చిపోవు. పాతివ్రత్య భావజాలాన్ని ఆ నాటి స్త్రీల మీద ఏ విధంగా రుద్దిందీ అర్ధం కావాలంటే రేణుక కథని మించిన కథ మరొకటి లేదనుకుంటాను. సీత కథకూడా వుందనుకోండి ప్రతిరోజూ పచ్చికుండతో నీళ్ళు తెచ్చిపోసే రేణుక… ఒకరోజు సరస్సు తీరాన శృంగార భంగిమలో వున్న జంటని చూసిందట. ఆమె మనసులోను శృంగార భావనలు రేకెత్తాయట అంతే… పచ్చికుండ కాస్తా విచ్చిపోయిందంట. నీళ్ళు తేవడం ఆలస్యం అయిపోయింది. జమదగ్ని ‘దివ్య’ దృష్టితో ఇదంతా చూసి ఉగ్రుడైపోయి, తల్లి పాతివ్రత్యాన్ని అతిక్రమించింది (మనసులోనే సుమా) కాబట్టి ఆమె తలను నరకమని కొడుకుల్ని పురమాయించాడు. సరే ఇక్కడి నుండి కథ అందరికీ తెలుసుకదా! ఆ… అన్నట్టు ఈ కథకి దళిత కోణం కూడా వుంది. దాన్ని గురించి మరోసారి చర్చిద్దాం.
ఇంత భయానక, భీభత్సమైన కథలో తల్లిని చంపి ఘోర నేరం చేసినవాడు విష్ణువు అవతారమని, పురుషాహంకార హింసకు బలై ప్రాణాలు కోల్పోయిన రేణుక దేవత అని ప్రచారం చేసిన పురాణాలలో ఇలాంటి ఘోర కథలు ఇంకెన్ని వున్నాయో? ‘సతి’ దురాచారంలో బతికున్న భార్యను భర్త చితిలోకి తోసి చంపి, ఆమెకు గుళ్ళు కట్టిన ఘనమైన చరిత్ర లాంటిదే ఎల్లమ్మ కథ కూడా. ఆలయాన వెలసిన దేవతలంటూ ఆడవాళ్ళని కీర్తిస్తూ, ఆచరణలో ఆరని మంటలకి, రకరకాల హింసలకి గురిచేసే పితృస్వామ్య వ్యవస్థ దుర్మార్గాన్ని నిలదీసిన కథ ”తిరగరాసిన కథ”. పురుషాధిపత్యాన్ని నిలదీయడమే కాదు ఆధునిక చరిత్రను మేము తిరగరాస్తామంటూ నిరూపించారు సమతా బృందం. సంఘటితంగా పోరాడితే అన్ని అసమానతల్ని, వివక్షల్ని కూకట్‌వేళ్ళతో కూల్చేయవచ్చు అని తనకు ఎదురైన అన్ని సమస్యల్ని ధైర్యంగా ఎదిరించిన అధునిక మహిళ ఎల్లమ్మ కథ ఈ తిరగరాసిన కథ. ఒక చారిత్రిక పరాయజగాథని, స్పూర్తివంతమైన ఆధునిక పోరాట కథగా తిరగరాసి చూసించారు మహిళా సమత సాంస్కృతిక బృందం వారు.
స్త్రీల పరాధీనతకు పునాదులుగా వున్న కథలన్నింటినీ ఈ రోజు తిరగరాయాల్సి వుంది. ఆ పనిని విజయవంతంగా మొదలుపెట్టి, ప్రేక్షకుల మెదళ్ళలో కొంగ్రొత్త ఆలోచనల్ని రేకెత్తించిన మహిళా సమత బృందానికి హృదయపూర్వక అభినందనలు. ఇంతటి సృజనాత్మక, ఆలోచనాత్మక ప్రక్రియకి శ్రీకారం చుట్టిన సమతా బృందం సారథి ప్రశాంతి అత్యంత అభినందనీయురాలు.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...