Saturday, November 27, 2010

సాహితీ మిత్రురాలు ఓల్గా పుట్టినరోజు-నేనిచ్చిన బహుమతి


ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా ఈ రోజు తన పుట్టిన రోజును సాహితీ మిత్రుల మధ్య జరుపుకున్నారు.
మధ్యాహ్నం మిత్రులతో కలిసి మంచి విందు భోజనం ఆరగించా.
ఉదయం రెండు గంటలు కష్టపడి ఓల్గా కోసం ఈ బొకే తయారు చేసా.
ఏదైనా స్వహస్తాలతో తయారు చేసి మిత్రులకిస్తే...
ఆ తృప్తే వేరు.
నాకు అత్యంత ఆత్మీయురాలు అబ్బూరి చాయాదేవి గారు నేను చేసిన పొగడపూల బొకేని మెచ్చుకున్నారు.
ఓల్గా కి ఎంతో ఇష్టమైన పొగడ పూలు,సంపెంగ పూల బొకే ని తన పుట్టిన రోజునాడు బహుమతిగా ఇవ్వగలిగినందుకు నాకూ బోలెడు సంతోషంగా ఉంది.

Friday, November 26, 2010

లాడ్లి మీడియా అవార్డుల విజేతలు

పాప్యులేషన్ ఫష్ట్, భూమిక సమ్యుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన లాడ్లి మీడియా అవార్డుల విజేతల వివరాలు.
 ప్రింట్ తెలుగు
1           యిప్ప శోభారాణి                వార్త
2           కొండేపూడి నిర్మల              భూమిక కాలం
తెలుగు టివి
1            హెచ్ ఎం టివి                  భెష్ట్ డాక్యుమెంటరి        
2            ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి         బెష్ట్ ప్రోమో ఆన్ గర్ల్ చైల్డ్
3            వనితా టివి                     బెష్ట్ న్యూస్ సీరీస్
 ఉర్దు
 1           ఫరిదా రాజ్                     సియాసత్ 
వెబ్ కాటగిరి
 1           రాము.ఎస్                   www.andhrapradeshmediakaburlu.blogspot.com    Best blog


Wednesday, November 24, 2010

నా నేస్తానికి నేనిచ్చిన పొగడపూల బొకే

 ఈ రోజు ఉదయం నా ప్రియ నేస్తం గీత కోసం ఏదైనా విలక్షణంగా
తయారు చెయ్యాలనిపించింది.అనుకున్నదే తడవు కాఫీ కూడా తాగకుండా తోటలో వేట మొదలెట్టాను.
పొగడచెట్టు కింద పొగడపూలు రాలి ఉన్నాయి.వాటిని ఏరాను.
వాటితో బొకే చెయ్యాలనిపించింది.
చెట్లన్ని వెతికి దేవ గన్నేరు కొమ్మ తెంపి పొగడపూలని ఆకులకు ఇలా అతికించాను.
సంపెంగ చెట్లు (తెలుపు,పసుపు)విరగ పూసాయి.
వాటిని కోసి మధ్యలో పెట్టాను.
ఒకేఒక్క అనార్ పువ్వు దొరికింది.దాన్ని కూడా తెంపి అలంకరిస్తే ఈ అందమైన బొకే తయారయ్యింది.
ఆ బొకేని గీతకి ఇచ్చినప్పుడు తన ముఖంలో ఎంత సంతోషమో!!!
వెంటనే అక్కడ నా రూంలో ఉన్న బుద్ధుడి దగ్గర పెట్టింది.

గాఢ స్నేహం లో ఇలాంటి ఆనందాలని అస్సలు మిస్ అవ్వకూడదు.

Monday, November 22, 2010

మంచు కురిసే వేళలో -మా ఊరిలో

శీతాకాలంలో మా ఊరు కూనూరు లాగా ఉంటుంది.
ఊటి వెళ్ళిన వాళ్ళకి కూనూరు తెలిసే ఉంటుంది.
మా ఊరి నిండా పచ్చటి తోటలే ఉంటాయి.
రయ్ మని ఈలలేసే సరుగుడు తోటలు.
తోటకి తోటకి మధ్య గోడలాగా పెట్టే కోరాడులు.
కోరాడుల మీద పాతే బ్రహ్మజెముడు ముళ్ళపొదలు.
చలి కాలంలో ఈ బ్రహ్మజెముడు విరగ పూస్తుంది.
తెల్లటి బ్రహ్మకమలాల్లాగానే ఉంటాయి బ్రహ్మజెముడు పూలు.
ఉదయం లేచి మా వీధిలోకొస్తే అబ్బ! చూడాల్సిందే.
విపరీతంగా పొగమంచు కురుస్తూ ఉంటుంది.
మా ఇంటి వీధరుగు మొత్తం తడిసిపోయుంటుంది.
మంచుకురిసే వేళలో విరగబూసిన ఈ పువ్వుల సొగసు చూడాల్సిందే.
అప్పటికే మా వాళ్ళు చలి మంట వేసి ఉంటారు.
క్రితం రోజు తవ్వి తీసిన తేగలు మంటలో కాలుతూంటాయి.
నేను చిన్నప్పుడు నిద్రలేచిందే తడవు చలిమంట దగ్గర చేరడం
మా అమ్మ ఓ గమ్మత్తైన తిట్టు తిట్టేది.
జడ్జిగారమ్మా మొగుళ్ళా ఎలా కూర్చుందో చూడండి అనేది
మా నాన్న నవ్వుతూ చూసేవాడు కానీ ఏమీ అనే వాడు కాదు.
మా అమ్మ తిట్టిన తిట్టో ఆశీస్సో తెలియదు కానీ


 జడ్జిగారమ్మా మొగుళ్ళా కాదు కానీ జడ్జీ కే సహచరినయ్యాను.
ఇంతకీ మా ఊరి మంచు గురించి చెబుతూ ఎటొ వెళ్ళిపోయాను.
సరుగుడు చెట్లమీద జారిన మంచు ముత్యాలు సూర్యుడి తొలికిరణం పడగానే మిల మిల మెరిసిపోయేవి.
చాలా సార్లు తొమ్మిదైనా మంచు విడిపోయేది కాదు.
ఆ మంచులో గడ గడ వణుకుతూ నడుచుకుంటూ బడికి బయలుదేరేవాళ్ళం.
స్వెట్టర్ పేరు కూడా వినని రోజులు.
ఒక్కోసారి వర్షం కురిసినట్టు మంచు కురిసేది.
మేము తడిసి ముద్దయ్యే వాళ్ళం.ఆ తడిసిపోయిన బట్టలతోనే బడికెళ్ళే వాళ్ళం.
మా ఊరి మంచుతో ఎన్నెన్ని జ్ఞాపకాలు.
ఆ అన్నట్టు మరిచిపోయాను.
ముందురోజు సాయంత్రం తంపటేసిన తేగల్ని రాత్రంతా మంచులో పెట్టి తింటే
ఆ మజాయే వేరు సుమా!
ఆ తేగల్ని నములుకుంటూ వాటిల్లోని చందమామల్ని ఎగరేసుంకుంటూ
మంచులో నడుస్తూ బడికెళ్ళిన రోజులు ఎంత బావుండేవో.
ఆ జీవితంలో ఎంత కష్టముందో అంతే సంతొషముంది.

Sunday, November 21, 2010

ఆస్మాన్ మే కభి కభి అకేలే రెహనేకా మన్ లగ్తా హై

(మేం త్వరలో ప్రారభించబోయే ఓపెన్ స్పేసే ఆస్మాన్)

ఆస్మాన్ మనందరి ఆశల హరివిల్లు
ఆకాశంలో అపుడప్పుడూ ఆనందంగా
వంట ఇల్లులేని ఆస్మాన్
అంట్లు తోమక్కరలేని ఆస్మాన్
బట్టలుతక్కరలేని ఆస్మాన్
బల్లలు తుడవక్కరలేని ఆస్మాన్
కధ రాసుకోవాలనుందా
కవిత్వం కలబోసుకోవాలనుందా
ప్రియ సఖికి ప్రేమ లేఖ రాయాలనుందా
కళ్ళు మూసుకుని కమ్మటి పాటలు వినాలనుందా
ఏ కాగజ్ కి కష్టీ ఏ బారిష్ కీ పానీ
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు
ఎందుకే నీకింత తొందరా ఓ చిలుక
నా చిలుకా ఓ రామ చిలుకా
గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా
ఉబికి ఉబికి వెల్లువెత్తే ఈ పాటల్ని వినాలనుందా
ఊరికే అలా కూర్చుని రంగులు మారే
ఆకాశాన్ని చూడాలనుందా
పున్నమి నాటి వెన్నెల్లా,పున్నాగ పూల వర్షంలా
ఒక ఏకాంతం,ఒక నిశ్శబ్దం
నచ్చిన నెచ్చెలి తో ఒక సాన్నిహిత్యం
చట్రాలులేని,సరిహద్దులులేని
అవధుల్లేని అడ్డు అదుపుల్లేని
ఆనందాల గని సంతోషాల పెన్నిధి
మా ఆస్మాన్
ఈ ఆస్మాన్ లో అపుడపుడూ
నన్ను నేను దొరికించుకునే
స్వేచ్చా ప్రపంచం
నాకై నేను సృష్టించుకోబోతున్న
సరికొత్త సంతోష సౌధం
నేనులోంచి మనంలోకి సాగే
మరో మహా ప్రయత్నానికి
మేలిరకమైన బాట మన ఆస్మాన్.

Wednesday, November 17, 2010

ఒంటరి దీవులు

జీవితం పూడ్చలేని ఓ అగాధంలా మారుతోంది
దేనితో పూడ్చాలి ఈ అగాధాన్ని?
జనం ఇరుకిరుకు గూళ్ళల్లోంచి బయటపడి
రోడ్ల మీద చీమల్లా పాకుతున్నారు
నోళ్ళు తెరుచుకుని నిలబడ్డ మహా మాల్స్
ఈ జనాన్ని అమాంతంగా మింగేస్తున్నాయ్
వందలాది వెర్రి మొర్రి చానల్స్
కంటి రెటీనా మీద కబ్జా చేస్తున్నయ్
ఇంటెర్నెట్ మహా మాయ
నరనరాల మీద నాట్యం చేస్తోంది
మొబైల్ ఫోన్ల మహ ప్రవాహం
చెవుల్లోంచి గుండెల్లోకి జారి
అయిస్ లా గడ్డకడుతోంది
"ఎవరికి వారౌ స్వార్హంలో
హ్రుదయాలరుదౌ లోకంలో"
నా కారు,నా చానెల్, నా మొబైల్, నా ఎఫ్.ఎం,
నా ఏ టి ఎం,నా ఇంటెర్నెట్, నా బాంక్ బాలెన్స్
ఇలా "నా"చుట్టూ గిరికీలు కొడుతున్నాం
మనం స్రుష్టించిన అద్భుత టెక్నాలజీ
మనల్నెంత ఒంటరుల్ని చేస్తోంది
"మన" ని "మనిషి" ని మర్చిపోయి
ఎవరికి వారం ఒంటరి దీవులమౌతున్నాం
తోటి మనిషి మాత్రమే పూడ్చగలిగిన
ఈ అగాధాలను
మార్కెట్లను ముంచెత్త్తుతున్న
మహా మాల్స్ లోని మహా చెత్త పూరిస్తుందా
మరింత అగాదగాన్ని స్రుష్టిస్తుంది తప్ప
మానవీయతని ప్రోదిచేస్తుందా
మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుందా.

Sunday, November 14, 2010

నిన్న రాత్రి ఎనిమిది బ్రహ్మకమలాలు పూసాయ్ కానీ......



మా ఇంట్లో ఒక్కటే మిగిలింది.

మూడు పువ్వులు జలవిహార్ రామ రాజు గారింటికి వెళ్ళాయ్.

ఒక పువ్వు కొడవటిగంటి కుటుంబరావు గారి అమ్మాయి శాంతసుందరి గారింటికి

ఇంకొకటి వారణాసి నాగలక్ష్మి గారింటికి

మరో రెడు పువ్వులు హెచెం టివి సుజాత (సి.సుజాత)గారింటికి పయనమై వెళ్ళాయి.

ఈ పువ్వుల నుంచి నేను ఎంతో ఆనందం పొందాను.

దాన్ని అందరికీ పంచాలనే పువ్వులు పంచాను.

Tuesday, November 9, 2010

నేను స్త్రీవాదిని పురుషద్వేషిని కాదు

ప్రపంచాన్ని స్త్రీల దృష్టి కోణం నుంచి చూడమంటాను
పురుషులు లేని ప్రపంచాన్ని నేను కోరడం లేదు
ఆడపిల్లలు అన్నింటిని ఆఖరికి ప్రాణాన్ని సైతం
కోల్పోతున్నారని ఆవేదన చెందుతాను
పది లక్షల మంది ఆడపిల్లల్ల్ని పుట్టకుండా చంపేసిన
ఈ పుణ్య భూమి,ఈ వేద భూమి
ఆహా ! ఎంత హిపోక్రసీ!!!!!
గల్లీకో గుడి, గుడికో దేవత
అమ్మా !! తల్లీ!! అంటూ సాష్టాంగ నమస్కారాలు
ఇంటికొచ్చి అదే నోటితో నీ యమ్మ, నీ అక్క అంటూ బూతు దండకాలు
మాతృమూర్తి,మాతృదేవత అంటూ
ఉదారంగా బిరుదుప్రదానాలు
బిడ్డల పెంపకంలో ముద్దులాడ్డానికే పరిమితం
అడ్డమైన చాకిరీ ఆమెకే అంకితం
ఇదేమి న్యాయం అంటే
ఇదే ఇక్కడి న్యాయం పురుషన్యాయం
నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి అన్న
మనువు గాడి న్యాయం
మన న్యాయ శాస్త్రానికి అదేగా పునాది
ఆటలోన, పాటలోన, చదువులోన
వనరులోన,వ్యవసాయంలోన
ఆర్ధికంలోన,రాజకీయంలోన
పంపకాలలోన, పరిపాలనలోన
ఇంటిలోన,ఇంటివెలుపల
అన్నింటా వివక్ష,ఆఖరికి
అన్నం పెట్టడం లో లో కూడా వివక్ష
ఇది అన్యాయం,ఇది అసమానత్వం
ఇంతే కదా మేము ఎలుగెత్తి అడిగింది
ఇది పురుష ద్వేషం,కుటుంబ విధ్వంశం
అంటూ అడ్డంగా వాదిస్తారేంటి?
కాదు ముమ్మాటికీ కాదు
మాది పురుష ద్వేషం కాదు
కుటుంబంలో ప్రజాస్వామిక సంబంధాల కోసం
స్త్రీపురుషుల మధ్య స్నేహపూర్వక ప్రేమ బంధాల కోసం
అన్నింటా సమానత్వం కోసం
హింసలేని సమాజం కోసం మా పోరాటం
మిమ్మల్ని కూడా కలుపుకోవాలని మా ఆరాటం
భుజం భుజం కలిపి మీరు మేము
కలిసి మనమవ్వాలనే మా ఆశయం.
ఇందుకోసం ఎస్ !! నేను స్త్రీవాదినే
పురుషద్వేషిని మాత్రం కాదు.

Monday, November 8, 2010

తుపాకీ మొనపై వెన్నెల

క్రితం సంవత్సరం జమ్మువెళ్ళి వచ్చిన దగ్గరి నుంచి శ్రీనగర్‌ చూడాలనే కోరిక మరింత బలపడసాగింది. మేం శ్రీనగర్‌ ప్రోగ్రామ్‌ వేసుకోగానే ఎక్కువమంది నిరుత్సాహపరిచారు.ముందే అక్కడ శాంతి భద్రతల సమస్య వుంది దానికి తోడు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. శ్రీనగర్‌కు వెళ్ళడం మంచిది కాదు అని సలహా ఇచ్చారు. అయిన మేం వెళ్ళడానికే నిర్ణయించుకున్నాం.
మే ఒకటవ తేదీన ఢిల్లీలో దిగగానే పిడుగులాంటి వార్తను మోసుకొచ్చారు ప్రొటోకాల్‌ అదికారులు. ఏప్రిల్‌ 26 నుంచి వరసగా నాలుగు రోజులు శ్రీనగర్‌లో వర్షాలతో పాటు, విపరీతంగా మంచు కురిసిందని, లేకు వెళ్ళే రోడ్లు మంచుతో నిండిపోవడం వల్ల ముసేసారని ఆ వార్త సారాంశం. శ్రీనగర్‌, సిమ్లా, కులు,మనాలి ప్రాంతాల్లో మంచు కురస్తుండడం వల్ల అక్కడికి విమాన సర్వీసులు రద్దయ్యాయని కూడా చెప్పారు. ప్రాణం ఉస్సురంది. మాతోపాటు శ్రీనగర్‌ ప్రోగ్రామ్‌ పెట్టుకున్న మరొకరు వాళ్ళ ప్రయాణం కాన్సిల్‌ చేసుకున్నారు. ఢిల్లీలో రెండు రోజులు గడిపాక మే మూడో తేదీన ఉదయం తొమయ్మిది గంటల ఫ్లయిట్‌కి మేం శ్రీనగర్‌ వెళ్ళాల్సి వుంది.
రెండో తేదీ సాయంత్రం నా బెంగాలీ మిత్రురాలు ఉత్పల వాళ్ళింటికి వెళ్ళాం. మాటల సందర్భంలో ఉలన్‌ దుస్తులు తీసుకెళుతున్నారా అని అడిగింది ఆమె. నేను ఒక షాల్‌ మాత్రమే తీసుకెళుతున్నానని చెప్పాను. శ్రీనగర్‌, లే వెళుతూ ఒక్క షాల్‌ సరిపోతుందనుకున్నావా అంటూ తన దగ&గరున్న ఉలెన్‌ బట్టలన్నీ ఓ సూట్‌కేస్‌ నిండా సర్ది ఇచ్చింది. రెండు లాంగు కోటులు, మంకీక్యాప్‌లు, షాక్సులు, గ్లౌజులు, స్వెట్టర్‌లు చూసి ఇవన్నీ ఎందుకని నేను నవ్వితే అక్కడికెళ్ళాక అర్థమౌతుందిలే ఎందుకో అని తనూ నవ్వింది. నిజంగానే లే వెళ్ళాక నాకు బాగానే అర్థమైంది. అవన్నీ తీసుకెళ్ళి వుండకపోతే మేం చలికి గడ్డకట్టుకుపోయేవాళ్ళం.
ఉత్పల ఇచ్చిన అదనపు సూట్‌కేస్‌తో సహా మూడో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళాం. మాతోపాటు కాశ్మీరుకు చెందిన మరొక ఆంధ్రప్రదేశ్‌ జడ్జి, ఆయన భార్య వహీదా కూడా సమ్మర్‌ వెకేషన్‌ కోసం శ్రీనగర్‌ వెళుతున్నారు. శ్రీనగర్‌ ఫ్లయిట్‌ కన్‌ఫర్మ్‌ అయ్యేవరకు నాకు ఆందోళనగానే వుంది. వ్రీనగర్‌లో వాతావరణం మెరుగైందని విమానం బయలుదేరబోతున్నదని తెలియగానే నా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. విమానం గాల్లోకి లేవగానే నా మనసు విమానం రెక్కమీదకెక్కి కూర్చొంది. వెన్నముద్దల్లాంటి మబ్బుతునకల్ని చీల్చుకుంటూ విమానం ఎగురుతోంది. ఓ అరగంట గడిచాక వహీదా నన్ను పిల్చి ఇక్కడ కూర్చో అంటూ కుడివైపు విండో సీట్‌ ఆఫర్‌ చేసింది. ఆ సీట్లో కూర్చుని కిటికీ నుంచి బయటకు చూడగానే అద్భుతమైన దృశ్యం కంటబడింది. మంచుతో కనప్పబడి, సూర్యకాంతికి మెరుసు&తన్న హిమాలయ ఉత్తుంగ పర్వత పంక్తులు. లోతైన లోయలు, సన్నటి నీటి పాయలు ధవళ కాంతులీనుతున్న పర్వత సముదాయాలు మనస్సును పులకరింపచేసాయి. కన్నార్పితే ఏ సౌందర్యం కనుమరుగైపోతుందో అని చేపలాగా అనిమేషనై అలాగే చూస్తుండిపోయాను. కాశ్మీరు లోయలోకి ప్రవేశిస్తున్నాం అంది వహీదా. కళ్ళను కట్టిపడేసే ఆ ఆకుపచ్చలోయ సొగసును అనుభవించాలి తప్ప మాటల్లో వర్ణించలేం. పచ్చనిలోయ చుట్టూ మే నెల ఎండలో మెరుస్తున్న మంచు పర్వతాలు. మరో పావు గంటలో విమానం శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది.
ఎయిర్‌పోర్ట్‌ నించి బయటకు వచ్చి కారులో కూర్చుని తలుపు వేయబోయాను. ఒక్క అంగుళం కదలలేదు. ఆ తర్వాత తెలిసింది అది బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారని. ఎందుకు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారని అడిగితే ఇక్కడ మిలెటెన్సీ ప్రోబ్లమ్‌ వుంది. సెక్యూరిటీ కోసం తప్పదు అన్నరు. నా వరకు ఆ కారులో కూర్చోవడం ఇష్టంలేకపోయింది. కాని తప్పలేదు. ఎకె 47 పట్టుకున్న పట్టుకున్న పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ముందు సీట్లో సెటిల్‌ అయిపోవడం కూడా నాకు ఎంత మాత్రమూ నచ్చలేదు.
మాకు టూరిస్ట్‌ గెస్ట్‌ హౌస్‌లో బస ఏర్పాటు చేసారు. శ్రీనగర్‌ రోడ్లమీద జనం కంటే పోలీసులు, మిలటరీ వాళ్ళు, బోర్డర్‌ సెక్యూరిటీ వాళ్ళు అడుగడుగునా ఆవరించి కని&పంచారు. మేం గెస్ట్‌ హౌస్‌కి వెళ్ళేలోపు నాలుగైదు చెక్‌పోస్ట్‌లను దాటాం. గెస్ట్‌ హౌస్‌ ఆవరణలో కారు ఆగగానే తలుపుతీయబోయి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. ఆవరణలో ఆకాశాన్నంటిన చినార్‌ చెట్లు కారు కలి&పంచిన విసుగును దూరం చేసాయి. చినార& చెట్లు మహావృక్షాల్లా, నిండా ఆకుల్తో చూడ్డానికి ఎంత బావున్నాయో! మాకిచ్చిన రూమ్‌లో అడుగుపెట్టి కిటికీ తలుపు తెరవగానే ఉరవడిగా పారుతున్న నదిమీంచి వచ్చిన గాలి ఉక్కిరిబిక్కిరి చేసింది. అది జీలం నది అని తర్వాత తెలిసింది. చినార్‌ చెట్ల సౌందర్యం, జీలం నది దర్శనం నాలో గొప్ప సంతోషాన్ని నింపినా అడుగడుగునా కప్పించిన పోలీస్‌ మిలటరీ, బి ఎస్‌ ఎఫ్‌ జవాన్లు నాలో మాత్రం చాలా ఆందోళనను కల్గించారు.
ఆరోజు సాయంత్రం దాల్‌లేక్‌ చూడ్డానికి వెళ్ళాం. హిందీ సినిమా పాటల్లో చూసి ఈ సరస్సు పట్ల అభిమానం పెంచుకున్న వాళ్ళలో నేనూ వున్నాను. షికారీలు, హౌస్‌ బోటులు విస్తారంగా పరుచుకున్న జలరాసి చూడడానికి ఎంతో బావున్నా జీవం లేనట్టుగా, చైతన్యరహితంగా వున్న ఆ పరిసరాలు మాత్రం మనసును మెలిపెట్టాయి. వందల సంఖ్యలో వరసగా కొలువు తీరిన లగ్జరీ హౌస్‌ బోటులు, సరస్సు నలువైపులా బారులు తీరిన షికారీలు మనుష్యులు లేక వెల వెల బోతున్నాయి. దాల్‌లేక్‌లో పన్నెండు వందల హౌస్‌ బోటు లున్నాయని, టూరిస్టులు లేక అన్నీ ఖాళీగా పడివున్నాయని మా షికారీని నడిపిన హమీద్‌ చెప్పాడు. హౌస్‌ బోటుల్లోపల గదులు ఫైవ్‌స్టార్‌ హోటళ్ళలో గదుల్లా అన్ని హంగులతో వున్నాయి. ప్రతి బోటు ముందు దిగులు ముఖాలతో యజమానులు కూర్చునివున్నారు. హమీద్‌ ఫ్లోటింగు గార్డెన్‌ గురించి చెబుతూ గబుక్కున షికారీలోంచి నీళ్ళల్లో ఏపుగా ఎదిగిన గడ్డిమీదికి దూకాడు. గమ్మత్తుగా ఆ గడి&డ లోపలికి కుంగి వెంటనే పైకి లేచింది,. మేం ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాం. ' ఏ పానీకా ఊపర్‌ జమీన్‌' అంటూ నవ్వాడు. దానిమీద టమాటాలు, కీరకాయలు, తరుబూజాలు పండుతాయని చెప్పి మరింత ఆశ్చర్యపరిచాడు. దాల్‌లేక్‌ మధ్య చిన్న ద్వీపం. దాని మీద నాలుగు చినార్‌ చెట్లు వుండే ప్రాంతాన్ని చూపించి దీన్నీ ' చార్‌ చినార్‌' అంటారని చెప్పి అటు తీసుకెళ్ళాడు. చుట్టు పరుచుకుని వున్న మంచు కొండలు దాల్‌లేక్‌ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంటాయి.
శ్రీనగర్‌లో చక్కటి ఉద్యానవనాలు చాలా వున్నాయి. వీటన్నింటినీ మొఠల్‌ గార్డెన్స్‌ అనే పిలుస్తారు. చష్మీషాహి, పరీమహల్‌, నిషాద్‌, హనూర్‌, షాలిమార్‌. వీటిలో చష్మీషాహి ఉద్యానవనంలో ఓ ప్రత్యేకత వుంది. అక్కడ భూమి నుంచి ఉబికి వచ్చే సహజసిద్ధమైన వాటర్‌ ఫౌంటెన్‌ నుంచి చల్లటి, స్వచ్ఛమైన నీళ్ళు సంవత్సరం పొడుగునా వస్తుంటాయి. ఆ నీళ్ళనే నెహ్రూ తాగేవాడని చెప్పి మాచేత కూడా తాగించారు. ఫ్రిజ్‌లోంచి తీసినట్టు చల్లగా వున్నాయి. మిగతా మొఘల్‌ గార్డెన్స్‌ కూడా చూసాక శ్రీనగర్‌లో ప్రసిద్ధమైన సిల్క్‌ చీరల ఫ్యాక్టరీని చూద్దామని మాతో వచ్చిన వాళ్ళని అడిగాం. మా డ్రైవర్‌ చీకటి పడబోతోందని, ఇంక బయట తిరగడం మంచిది కాదని అడ్డుపడ్డాడు. ఇంకా ఆరున్నర కూడా కాలేదు. అక్కడ ఏడున్నర దాకా వెలుగుంటుంది. ఇప్పుడే రూమ్‌కెళ్ళి ఏం చేస్తాం పోనీ షాపింగుకి వెళదాం అంటే మార్కెట్‌కెళ్ళడం అస్సలు శ్రేయస్కరం కాదని తెగేసి చెప్పాడు. ఏడు కూడా కాకుండానే మమ్మల్ని గెస్ట్‌హౌస్‌లోకి తోసేసి వెళ్ళిపోయాడు.
మర్నాడు గుల్‌మార్గ్‌ వెళ్ళాలని చాలా తొందరగా తయారైపోయాం. గుల్‌మార్గ్‌ శ్రీనగర్‌కి 57 కిలోమీటర్ల దూరంలో 2730 మీటర్ల ఎత్తులో వుంది. గుల్‌మార్గ్‌ అంటేనే పూల రహదారి. శీతాకాలంలో కురిసిన మంచు జూన్‌, జూలై నెలల్లో కరిగిపోయి పర్వతాలు మొత్తం రంగు రంగుల పూలతో నిండిపోతుంటాయట. మేం వెళ్ళింది మే నెలలో కాబట్టి ధవళ కాంతుల్తో మెరిసే కొండల్ని మాత్రమే మేం చూడగలిగాం. తొమ్మిదింటికి మా డ్రైవర్‌ అన్వర్‌ వచ్చాడు. వచ్చీ రాగానే ' మీరు నిన్న మార్కెట్‌కి వెళదామన్నారు చూడండి, అక్కడే గ్రేనెడ్‌ పేలింది రాత్రి. ఒక మిలటరీ జవాను ఇద్దరు పౌరులు గాయపడ్డారు!'అన్నాడు. 'నిజంగానా' అన్నాను నేను. ' ఇది మాకు అలవాటైపోయింది. మేం గ్రేనేడ్స్‌ మద్య బతకడం నేర్చుకున్నాం' అన్నాడు మనసంతా వికలం అయిపోయింది.
మా మూడ్స్‌ మళ్ళీ మామూలు అయ్యింది గుల్‌మార్గ్‌ దారిలో పడ్డాకే. దట్టమైన అడవిలోంచి ప్రయాణం అద్భుతంగా వుంటుంది. ఆకాశాన్నంటే ఫైన్‌, దేవదార్‌, పోప్లార్‌ వృక్షాలు. కొండపైకి వెళ్ళే కొద్దీ దగ్గరయ్యే మంచుకొండలు. కొండలమీద అక్కడక&కడ రాత్రి కురిసిన మంచు ముక్కలు. పెద&ద మంచు దిబ్బ మా కారుకు అడ్డు వచి&చంది. అన్వర్‌ దానిమీద నుంచే కారు పోనిచ్చాడు. మెత్తగా జారిపోయింది కారు. అక్కడి నుంచి మంచు మీదే ప్రయాణం. పన్నెండులోపే గుల్‌మార్గ్‌ చేరిపోయాం. ఎక్కడ చూసినా మంచే. కారుదిగి మంచు మీద నడుస్తుంటే ఇది కలా నిజమా అన్నంత అబ్బురమన్పించింది. మంచుతో నిండిపోయిన కొండలమీద కూడా సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. వేడి మాత్రం తగలటం లేదు. కాసేపు మంచులో కేరింతలు కొట్టాక గండోలా( కేబుల్‌ కార్‌) లో టాప్‌ ప్లేస్‌ ఐన సెవెన్‌ స్ప్రింగ్సు చేరాక సూర్య కిరణాలతో ధగధగ మెరిసిపోతున్న ఆ హిమసమూహ దర్శనం మమ్మల్ని సమ్మోహితులను చేసింది. కన్నార్పడం మర్చిపోయాం. ఐస్‌మీద ఎగిరాం. గుప్పెళ్ళనిండా తీసుకుని గుండెలకద్దుకున్నాం. మోకాళ్ళలోతు మంచులో నడవడం గురించి నేను కల కూడా కని వుండను. ఆ స్వచ్ఛమైన మంచు స్పర్శని అనుభవించడం కోసం నేను వేసుకున్న ఊలు దుస్తుల్ని తీసిపారేసి, చీరతోనే తిరిగాను. మైనస్‌ డిగ్రీ చలిలో, ఆ మంచులో స్వెట్టర్లాంటిదేదీ వేసుకోకుండా, మంచు మత్తులో తిరిగినదాన్ని అక్కడ నేను ఒక్కదాన్నే. ఆ అందమైన అనుభవాన్ని గుండెల్లో దాచుకుని గుల్‌మార్గ్‌ నించి తిరుగు ప్రయాణమైనాం. వెళ్ళేటప్పుడు మామూలుగానే వున్న మా రావ్‌ ముఖం తిరిగివచ్చేటప్పుడు ఆపిల్‌ పండు రంగులో కొచ్చింది. 'స్నోబైట్‌' ' సన్‌బర్న్‌' అని తర్వాత తెలిసింది. ముఖమంతా కమిలిపోయినట్లయింది. 'నిన్ను మంచు కరిచింది. నన్నేమో ముద్దుపెట్టుకుంది ' అంటూ ఏడిపించాను.
మర్నాడు పెహల్‌గావ్‌ వెళ్ళొచ్చని, అనంతనాగులో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఏమి ప్రమాదం లేదని అన్వర్‌ ప్రకటించాడు. అమర్‌నాథ్‌ యాత్ర పెహల్‌గావ్‌ మీదుగానే జరుగుతుంది. అమర్‌నాథ్‌ గుహ పెహల్‌గావ్‌కి 16 కి.మీ దూరంలో వుంది. ప్రపంచంలోనే ప్రసిద్దమైన కుంకుమపువ్వుల పొలాలు కూడా ఈ దారిలోనే వున్నాయి. అయితే మా పెహల్‌గావ్‌ ప్రయాణం అంత సాఫీగా జరగలేదు. శ్రీనగర్‌ నుంచి మేం ముఫ్ఫై కిలోమీటర్లు ప్రయాణం చేసాక ఓ పెద్ద ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోయాం. అనంతనాగులో ఆ క్రితంరోజే ఎన్నికలు ముగిసాయని, భద్రతా దళాలు, ఎన్నికల సామాగ్రి, సిబ్బంది ఓ పెద్ద కాన్వాయ్‌గా జమ్ము బయలుదేరిందని అన్వర్‌ చల్లగా చెప్పాడు. మూడు గంటల పాటు ఆగిపోయాం. ఎలాగో దాన్నుండి బయటపడి పెహల్‌గావ్‌ చేరేటప&పటికి రెండయిపోయింది. శేష్‌నాగు సరస్సుకు వెళ్ళలేకపోయాం. అయితే మా ప్రయాణం పొడవునా ట్రెడ్పీనది పరవళ్ళను చూడగలిగాం. రాళ్ళమీద గల గల పారే ట్రెడ్సీనది నీల్లు ఫ్రీజర్‌లోంచి తీసినట్టున్నాయి. తిరుగు ప్రయాణంలో నేషనల్‌ పార్క్‌లో వున్న ట్రాట్‌ ఫిష్‌ ఫామ్‌కెళ్ళి వేడి వేడి ఫిష్‌ తిన్నాం. అతి చల్లటి ఫ్రెష్‌ వాటర్‌లోనే ట్రాట్‌ఫిష్‌ బతుకుతుంది. దేశంలో మరెక్కడా ఈ చేప దొరకదట. శేష్‌నాగు సరస్సును చూడలేకపోయామన్న నిరాశతో తిరిగి వచ్చేం.
మే 7 న ఉదయం తొమ్మిదింటికి మా ' లే' ప్రయాణం మొదలైంది. లే గురించి మమ్మల్ని చాలా మంది బయపెట్టారు. సముద్రమట్టానికి 14,500 అడుగుల ఎత్తులో వుంది లే పట్టణం. అది లదాఖ్‌ రాజధాని. ఒక్కసారిగా ఆ ఎత్తైన ప్రదేశంలో కాలు పెట్టగానే చాలా ఆరోగ్య సమస్యలు అంటే తీవ్ర తలనొప్పి, కళ్ళు తిరగడం, ఒళ్ళంతా బరువెక్కిపోవడం, ఊపిరాడకపోవటం లాంటి సమస్యలతో పాటు గడ్డకట్టించే చలి వుంటుందని నేను ఇంటర్‌నెట్‌ ద్వారా తెలుసుకున్నాను. మిత్రులు కూడా చెప్పారు. శ్రీనగర్‌ నుంచి లే కు విమానంలో అయితే అరగంటే పడుతుంది. అదే కారులో అయితే 20 గంటలు పడుతుందట. కార్గిల్‌లో రాత్రి ఆగి వెళ్ళాల్సి వుంటుంది. అయితే ఏప్రిల్‌ 26 న కురిసిన మంచు వల్ల శ్రీనగర్‌ - లే రహదారి మూసేసారు. మేం విమానంలోనే వెళ్ళాం. లే లో విమానం రెండు కొండల మధ్య నుంచి దిగుతుంది. ఆ దృశ్యం తప్పకుండా చూడు అని వహిదా చెపి&పంది. తొమ్మిదిన్నరకి లే లో దిగాం. నిజంగానే విమానం ల్యాండింగు అద్భుతంగా వుంది. గమ్మత్తుగా ఒక వేపు మంచు కొండలు, ఒక వేపు ఎడారి లాంటి ఇసుకకొండలు. వాటి మధ్యనించి విమానం దిగింది. ఎందుకైనా మంచిదని భుజానికి వేలాడుతున్న స్వెట్టర్‌ని ఒంటికి తగిలించాను. మెట్లు దిగుతుంటే వంద కేజీల బియ్యం బస్తా తలమీద వున్న ఫీలింగు కలిగింది. ఒళ్ళంగా బరువుగా అయిపోయి ఆచితూచి అడుగేయాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలోనే వున్న ఫుల్‌మూన్‌ గెస్ట్‌హౌస్‌కి తీసుకెళ్ళారు. వేగంగా నడవొద్దని, వొంగకూడదని, ఎక్కువ మాట్లాడవద్దని, సాయంత్రం దాకా రెస్ట్‌ తీసుకోమని సలహా ఇచ్చారు ప్రోటోకాల్‌వాళ్ళు. డాక్టర్‌ వచ్చి మా ఇద్దరి బ్లెడ్‌ ప్రెషర్‌ చెక్‌ చేసాడు. నార్మల్‌గానే వుంది. చలి గడ గడ లాడించేస్తోంది. హై ఆల్టిట్యూడ్‌ వాతావరణంలో ఎదురయ్యే ఇబ్బందులేవీ మమ్మల్ని తాకలేదు. మేం సాయంత్రం ఫ్రెష్‌గా తయారై బయటకు వస్తుంటే మా డ్రైవర్‌ తాషి ' ఆప్‌ లోగు హమ్‌ సె బీ ఫిట్‌ హై, ఏక్‌ దమ్‌ ఫిట్‌' అంటూ నవ్వాడు. అతడా మాట అనగానే మాలోని ఆందోళనంతా పటాపంచలై వొళ్ళంతా తేలికగా అయిపోయింది. ఆ తర్వాత 'హోల్‌ ఆఫ్‌ ఫేమ్‌' పేరుతో మిలటరీ వాళ్ళు ఏర్పాటు చేసిన మ్యూజియం చూడ్డానికి వెళ్ళాం. లే చరిత్రతో పాటు, లదాఖ్‌ ఫెస్టివల్స్‌, నృత్యాల గురించిన సమాచారం ఎంతో వుందక్కడ. కార్గిల్‌ యుద్ధం, యుద్ధంలో మరణించిన వారి వివరాలు, సియాచిన్‌ గ్లేసియర్‌ ఫోటోలు, అక&కడి భద్రతా దళాలు ధరించే దుస్తుల వివరాలు, పాకిస్తాన్‌ ఖైదీల ఫోటోలు, వాళ్ళ నించి సంపాదించిన ఆయుధాలు అన్నింటినీ ప్రదర్శించారక్కడ.
అక్కడినుంచి మార్కెట్‌కు వెళ్ళాం. చిన్న బజారది. అక్కడే వున్న చహంగా విహార్‌కు వెళ్ళాం. లే చుట్టూ ఎన్నో బౌద్ధ ఆరామాలు వున్నాయి. వాటిని గొంపాలంటారు. హెమీస్‌, ఆల్చి, ఫైయాండ్‌, షె మొదలైన ఎన్నో గొంపాలు వున్నాయి. వీటిలో లే కు 40 కిలోమీటర్ల దూరంలో వున్న హెమీస్‌ గొంపా చాలా పెద్దది. ధనికమైనది. ఈ గొంపాల్లో వందల సంఖ్యలో లామాలుంటారు. ప్రతీ గొంపా విలక్షనమైన పూజా పద్దతుల్ని కలిగి వుంటుంది. కొన్నింటికి దలైలామా అధిపతిగా వున్నాడు.మేం ఏడున్నరదాకా బయట తిరుగుతూనే వున్నాం. పావు తక్కువ ఎనిమిది వరకు సూర్యాస్తమయం కాలేదు. మమ్మల్ని గెస్ట్‌ హౌస్‌లో వదిలేస్తూ తాషి ' ఇక్కడ వెన్నెల చాలా బాగుంటుంది . చూడండి' అన్నాడు. రావ్‌ ' ఇంత చలిలోనా చస్తాం' అన్నాడు. నేను మాత్రం ఎలాగైనా చూడాలి అనుకున్నాను. ఆరాత్రి తను నిద్రపోయాక లాంగు కోట్‌, గ్లౌస్‌ వేసుకుని, మంకీకేప్‌ తగిలించుకుని ఒక్కదాన్ని బాల్కనీలోకి వెళ్ళాను. వావ్‌! అద్భుతం! మంచుకొండలతో పోటీపడి కురుస్తున్న వెన్నెల, పండువెన్నెల ! తిలక్‌ ' అమృతం కురిసిన రాత్రి' కవిత అలవోకగా నా నాలుకమీదకొచి&చంది. చలికి కాలివేళ్ళు కొంకర్లు పోతున్నా అలాగే మైమరచి చూస్తూండిపోయాను. తాషికి థాంక్స్‌ చెప్పుకుని పిల్లిలాగా లోపలికొచ్చి రజాయిలో దూరిపోయాను. మంచుకొండలమీద వెన్నెలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు కలలు కంటూ వెచ్చగా నిద్రపోయాను.
మే ఎనిమిదో తేదీన మా అసలు అడ్వంచర్‌ మొదలైంది. 17,350 అడుగుల ఎత్తులో వున్న చాంగ్లా పాస్‌ దాటి 14,000 అడుగుల ఎత్తున వున్న పాన్‌గాంగు సరస్సును చూడడానికి మనస్సు తహతహలాడసాగింది. అంత ఎత్తుకెళ్ళడం చాలా కష్టమని,గాలిలో ఆక్సిజన్‌ చాలా తక్కువగా వుంటుందని మమ్మల్ని నిరుత్సాహపరచబోయారు. కాని మేం వినలేదు. తాషి మాత్రం మమ్మల్ని ఉత్సాహపరిచాడు. అవసరమొస్తుందేమోనని హాస్పిటల్‌ నుంచి ఆక్సిజన్‌ సిలిండర్‌ తెచ్చి పెట్టాడు. మేం ఎనిమిది గంటలకు బయలుదేరాం. మనాలి - లే రోడ్డు మీదుగానే చాంగ్లా పాస్‌కి వెళ్ళాలి. అతి పురాతనమైన సింధునది దర్శనం ఇక్కడే అయ్యింది. ' కారు' గ్రామం నుంచి కుడివేపు మనాలి రోడ్డు, ఎడంవేపు పాన్‌గాంగు సరస్సుకెళ్ళే రోడ్డు విడిపోతాయి. మా కారు ఎడంవేపు తిరిగింది. మాలో చెప్పలేని ఉత్కంఠ, ఉద్వేగం. చాంగ్లాపాస్‌ దాటగలమా లేదా అనే ఆందోళన. ఆ బృహత్తర పర్వత సముదాయాల మధ్య సన్నటి రోడ్డుమీద కారు మెలికలు తిరుగుతోంది. ఒక్క రోడ్డు తప్ప సమస్తం స్నోతో నిండివుంది. చిన్న చిన్న సెలయేళ్ళు, రాసులు రాసులుగా హిమపాతం. కారు దిగి కేరింతలు కొట్లాని, ఈల లేసి గోల చెయ్యాలనే బలమైన ఆకాంక్షని చలి చిదిమేసింది. అయినా ధైర్యం చేసి ఒక చోట దిగి మంచుని ముద్దాడుతూ ఫోటోలు తీసుకున్నాం. గడగడలాడిపోయాం. అక్కడ మైనస్‌ 4 టెంపరేచర్‌ వుంటుందని తాషి చెప్పాడు.చిన్న చలికే తట్టుకోలేని రావ్‌ మైనస్‌ డిగ్రీలో నిలబడటం నాకు స్థలమహత్యమన్పించింది. చాంగ్లాపాస్‌ దగ్గర పడుతుంటే తాషి ఆక్సిజన్‌ పెట్టాలా అని అడిగాడు. మేం వద్దన్నాం. నేను యోగాలో నేర్చుకున్న 'శీతలి ప్రాణాయామం' ద్వారా ధారాళంగా ఆక్సిజన్‌ లోపలకు పంపించగలిగాను. రావ్‌కు కూడా నేర్పాను. దీనివల్ల మాకు ఆక్సిజన్‌ లేమి సమస్య ఎక్కువగా ఎదురుకాలేదు. చాంగ్లా చేరగానే ప్రతి ఒక్కరికి ఏదో ఆరోగ్య సమస్య వస్తుంది కాబట్టి అక&కడ ఒక మిలటరీ కేంప్‌ పెట్టారు. ఫస్ట్‌ ఎయిడ్‌, టాయిలెట్‌ లాంటి సౌకర్యాలున్నాయి. మేం గడగడలాడుతూ కేంప్‌లోకి వెళ్ళగానే అక్కడున్న నాయక్‌ సుబేదార్‌ విష్ణు బహదూర్‌ గురండ్‌ మాకు మిరియాలతో కాచిన వేడి వేడి టీ ఇచ్చారు. ఆ చలిలో కారం కారంగా, వేడిగా గొంతులోంచి జారుతున్న టీ ఎంత తృప్తి నిచి&చందో మాటల్లో చెప్పలేను. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి మేం ముందుకు సాగాం. ఆ కొండల్లో చిన్న చిన్న గ్రామాలు చూసాం. గుర్రాలతో పొలం దున్నుతున్న రైతుల్ని చూసాం. పసిమినా గొఱ్రెల్ని మేపుతున్న కాపరుల్ని చూసాం. చకాచకా పరుగులు తీసే మర్మాడ్‌ ( కొండ ఉడతలు) లు, యాక్స్‌, కొండ మేకలు, రకరకాల పక్షులు కన్పించాయి.మరో అరగంటలో మేం పాన్‌గాంగు సరస్సు తీరాన వున్నాం. అద్భుతం. అపురూపం. విభిన్నరంగుల్లో మిల మిల మెరిసే 130 కిలోమీటర్ల పొడవైన ఉప్పునీటి సహజ సరస్సు దర్శనం ఇచ్చింది. ఇండియాలో నలబై, చైనాలో 90 కిలోమీటర్ల పొడవునా పాన్‌ గాంగు సరస్సు విస్తరించి వుంది. నాలుగు కిలోమీటర్ల అడ్డం వుంటుంది. అన్నింటినీ మించి 14,000 అడుగుల ఎత్తుమీద ఆవిర్భవించిన అద్భుత ప్రకృతి దృశ్య కావ్యం ఈ సరస్సు. క్షణం క్షణం రంగులు మారుతోంది. నీలం, ఆకుపచ్చ సరస్సు తీరాన చిత్తరువులమై వినమ్రంగా అలా నిలబడిపోయాం. మనస సరోవరం చూడాలన్న గాఢమైన కోరికను ఈ సరస్సు ఛిద్రం చేసేసింది. పాన్‌గాంగు సరస్సు కెరటాలు మా గుండెల్లోనే ఉప్పొంగుతుండగా మేం తిరుగు ప్రయాణానికి అయిష్టంగానే సిద్ధమయ్యాం. ఆ ... అన్నట్టు ఇక్కడ మిలటరీ కేంప్‌లో మాకు చక్కటి ఆతిథ్యమిచ్చిన వాళ్ళు మన తెలుగువాళ్ళేనండి. మేం ఇద్దరం తప&ప మూడో మనిషి నోటివెంట ఈ పదిరోజులుగా తెలుగుమాట వినని మేం ముగ్గురు తెలుగువాళ్ళని చూసి బోలెడు సంతోషపడ్డాం. వాళ్ళూ చాలా సంతోషించారు. నాయక్‌ షేక్‌ మహబూబ్‌ పాషా గిద్దలూరుకు, లాన్స్‌ నాయక్‌ రామానుజం చిత్తూరుకు, సిపాయి నాగేశ్వరరావు శ్రీకాకుళానికి చెందినవాళ్ళట. సంవత్సరం నుంచి ఇక్కడే వున్నారట. మా దగ్గరున్న చాక్‌లెట్‌లు, బిస్కట్‌లు, మెడిసిన్స్‌ అన్నీ వాళ్ళకిచ్చేసాం. వాళ్ళిచ్చిన వేడి వేడి టీ తాగి తిరుగు ప్రయాణమయ్యాం.
అప్పటికి మంచుకొండల మీద ఎండకాస్తోంది. అయితే మేం చాంగ్లా పాస్‌ దగ్గరికి వచ్చేటప్పటికి హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలుల్తో మంచు కురవడం మొదలైంది. మేం అదిరిపోయాం. ఆ అదురులోనూ మంచుకురవడాన్ని చూస్తున్నందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయిపోయాం. కొన్ని క్షణాల్లో మా కారు ముందు అద్దం మంచుతో నిండిపోయింది. వైపర్స్‌ కదలనని మొండికేసాయి. తాషి కిందికి దిగి అతి కష్టం మీద కొంత మంచును తొలగించి వైపర్స్‌ ఆన్‌ చేసాడు. మెల్లగా కారును నడపడం మొదలెట్టాడు. ఏకధాటిగా కురుస్తున్న మంచును చూస్తూ సర్వం మర్చిపోయాం. ఆక్సిజన్‌ విషయం అసలు గుర్తే రాలేదు. లోపలంతా ఓ ఉద్విగ్నత నిండిపోయింది. చాంగ్లాపాస్‌ ఎక్కి దిగిపోగానే వాతావరణం మళ్ళీ ఎండతో నిండిపోయింది. లే పట్టణంలోకి అడుగుపెట్టేముందు సిధు నదిని చూసాం. నీళ్ళల్లో దిగి ఆ చల్లటి నీటి స్పర్శని అనుభవించాం. ఇటీవలే అక్కడ సింధు దర్శనం పేరుతో ఓ ఉత్సవాన్ని ఎల్‌.కె. అద్వానీ ప్రారంభించినట్లు శిలాఫలకం మీద చదివినప్పుడు బౌద్ధమతస్తులు అదికంగా వున్న లే , లదాఖ్‌ లకు ' హిందూత్వ'ను దిగుమతి చేయడానికి అద్వాని ప్రయత్నాలు మొదలుపెట్టాడు కాబోలు అనుకున్నాను.
అపూర్వ అద్భుత అనుభవాలను మూటగట్టుకుని మర్నాడు ఉదయం మేం తిరుగు ప్రయాణమయా&యం. క్షణక్షణం మారే లే వాతావరణం మా విమానాన్ని ఆరుగంటలు ఆలస్యం చేసింది. ఇసుకతో కూడిన ఈదురుగాలులు, మబ్బులతో నిండిపోయే పర్వత సానువులు, దూరాన కొండల మీద వర్షం, ఎయిర్‌ పోర్ట్‌లో ఎండ ఇలా ఎన్నో వాతావరణ విన్యాసాల మధ్య మా విమానం గాల్లోకి ఎగిరి మమ్మల్ని ఢిల్లీ చేర్చింది.
పది రోజులపాటు కాశ్మీర్‌ అందాల్ని గుండెల్లో వొంపుకుంటూ పరవశించిపోయినా నాలోపలెక్కడో ఓ ముల్లు గుచ్చుకుంటూనే వుంది. ప్రతి కాశ్మీరీ ముఖంలో ' ఏదో పోగొట్టుకొన్నామన్న భావన' గుండెల్ని మెలిపెడుతూనే వుంది. శ్రీనగర్‌ సందుగొందుల్లో పేలుతున్న గ్రెనేడ్‌లు, భద్రతా దాళాల మోహరింపులు, పనుల్లేక ఉద్యోగాల్లేక గుంపులు గుంపులుగా రోడ్ల మీద తారసపడే కాశ్మీరీ ముస్లిమ్‌ యువకుల నిరాశామయమైన చూపులు ఇంకా నన్ను వెంటాడుతూనే వున్నాయి. అందమైన కాశ్మీర్‌లోయలో అందవిహీనం చేయబడిన కాశ్మీరీ జీవితం, అభద్రత, అన్యాయం మధ్య కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలను మర్చిపోవడం చాలాకష్టం. గత పదిహేను సంవత్సరాలుగా బారత భద్రతా దళాల తుపాకులకు, పాకిస్తాన్‌ ప్రేరేపిత ఆగ్రవాదుల బాంబు దాడులకు బలైపోయిన 80,000 వేల మంది మరణాలకు ఎవరి జవాబుదారీ లేదు. మూడు వేలమంది యువకులు లోయనుండి అదృశ్యమైపోయారని వాళ్ళేమయ్యారో ఎవరికీ తెలియదని మా పి.ఎస్‌.వో అన్నాడు. 8000 మంది స్త్రీలు బర్తలను పోగొట్టుకున్నారని, మరెందరో స్త్రీలు బతికి వున్నారో లేదో తెలియని బయంకర స్థితిలో సంగం విధవలుగా మారారని ఒక చోట చదివాను. 20 వేల మంది పిల్లలు అనాధాశ్రమంలో మగ్గుతున్నారని విన్పపుడు కడుపులో చెయ్యిపెట్టి కెలికినట్లయింది. ఒక పోలీసు ఉన్నతాధికారి పొరపాటుగా ఒక కుటుంబాన్ని టెర్రరిస్టులుగా భ్రమించి కాల్చి చంపి చావకుండా మిగిలిపోయిన అల్‌తాఫ్‌ అనే కుర్రాడిని, భార్య ప్రోద్భలం మీద దత్తత చేసుకుని పెంచుతున్నాడని విన్నప్పుడు నా వొళ్ళంతా కంపించిపోయింది. తల్లిదండ్రుల్ని చంపినవాడే తన ప్రస్తుత తండ్రి అని ఆల్‌తాఫ్‌కి బహుశా తెలిసి వుండదు. కాశ్మీరులో జరుగుతున్నదేమిటో అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఉదంతాలు సరిపోతాయనుకుంటాను. ఉత్తుంగ పర్వతాలు, మహావృక్షాలు, సరస్సులు, లోయల సోయగాలు ఒకవైపు, కర్కశ భద్రతా దళాల ఇనపబూట్ల చప్పుళ్ళు, పొగలు కక్కే ఎ.కె. 47లు, ఉగ్రవాదుల గ్రేనేడ్‌ పేలుళ్ళు, నెత్తురోడుతున్న శరీరబాగాలు ఇదీ నేటి కాశ్మీర్‌ వెన్నెల్ని, కటిక చీకటి అమావాస్యని ఒకేసారి అనుభవిస్తూ మేం హైదరాబాదులో అడుగుపెట్టాం.

Sunday, November 7, 2010

ATHEISM IS A WAY OF LIFE

When I look back into my past I can not but wonder at the changes that occurred in my life. Where have I started my journey and where have I reached! I did struggle a lot all these years to reach where I am today. In my struggle for existence my parents, friends and, later, my husband, helped me tremendously. I enjoyed the warmth of my friends throughout my life and I still do. The fragrance of friendship was with me at every major turn in my life. I love people and I have immense faith and trust in them. If I need any help of any kind, I look towards my fellow human beings.
I am an atheist. Atheism is a way of life for me. I don’t believe that a supernatural power rules this world. Nature is the prime caretaker of this world. If we protect nature it will protect us.
I said that atheism is a way of life for me. It has been so for the last thirty years. You may ask how I became an atheist and who influenced me. Nobody inspired me. Rahul Sankrutyayan’s “Olga to Ganga” made a tremendous impact on me. This book changed my whole attitude. After that I read a number of other books. Premchand’s “Godan” also inspired me. Before that I used to be very religious and believe in god. I had attended Bhajans and religious meetings. I remember participating in a religious function held in a temple and getting 1st prize for my performance on Gita. We were asked to read some Sanskrit slokas of our choice from Gita and explain their meaning. That too in front of thousands of people. I read some slokas and explained their meaning. Everybody appreciated my effort and I got the 1 st prize. That happened in the 70s and I was just 19 at the time. One reason for my prize-winning Gita performance was probably my training in Sanskrit. I was schooled in the Oriental system and consequently I had studied only Sanskrit from 6th to 10th standards, i.e., Sanskrit and nothing else, no math, no social studies, no science. My Sanskrit education included studying Meghasandesam, Kumarasambhavam, Kadambari, Raghuvamsham, Champu Ramayanam, Mrichakatikam, Amarakosam and other classical texts. This background must have helped me get the 1st prize in the Gita competition.
I should tell you about my family background. I was born in an agricultural family. My grandfather had seven sons and two daughters. My father was the second child. It was a big joint family. After my father married my mother, they remained with the joint family. My mother and the other women used to cook for nearly a hundred members of the joint family every day. The lives of these women, including my mother, were miserable. After the men ate, they would have the leftovers to eat, if at all. Occasionally, they would fill their stomachs with ganji (rice liquid) spiced with onions. In my childhood I noticed all these discriminations towards women in the joint family. At that time I was too young to understand the politics of the family. In our family my grandfather was king. He made all the decisions. My father had no voice. He worked in the fields all day. He didn’t even a have a shirt on his back. All seven of the brothers together had five, six shirts. My grandfather was miserly in the extreme. He expanded his holding to a hundred acres of land, but he would not spend money even on basic necessities. My education would cost money, but whom would I ask for it? My father was a frail man, almost naked with a small piece of cloth to cover his body, sleeping on the ground after a tedious day of work in the fields. How could I fight with that man for my education? I never approached him about my education, but he took the initiative on his own and tried to enroll me in a Christian school near my village. When my father escorted me to the school one day for admission, I declined to join. The Principal of the school told me during the interview that I should not wear “bottu” from that day on. I told him then and there that I would not remove my bottu and I would not join his school. I narrate this incident just to show that I was opinionated and traditional those days.
I joined the Oriental school when I was twelve years old. This school was 4 kms away from my village and I had to walk the 8 kms every day. The name of my village was Sitaramapuram. It was a small village and I loved it. My house was situated in the middle of fruit gardens that included mango, sapota, custard apple, and cashew nut groves. On one side of the village was Godavari and on the other the Bay of Bengal. I loved Godavari and boating on the river under the light of the full moon. I am still attached to my village and enjoy its warmth whenever I visit there.
Until 2005, my mother and I were together. When I migrated to Hyderabad my mother came with me. She was about 80-years old when she left me and this world at midnight on the 14th of May, 2005. I took her loss very naturally. Everybody dies one day. I served my mother wholeheartedly and cared for her myself. Though I had two brothers, one elder to me and the other younger, and two elder sisters, I took pride in taking care of my mother all by myself and making sure she was never wanting or unhappy. In the end, she passed away with ailments common to old age and I took every care to send her away with dignity and without any mental agony. When my mother was in the hospital in a very critical condition, I never prayed anyone to save my mother. I know her condition and the doctors told me that my mother was living her last days. I accepted the reality and I never propitiated any supernatural power for my mother. My mother had lived with dignity and went away with the same dignity. We took her body to our village and burned her remains in a family plot. My mother’s memory will remain with me till I die.
My parents never forced me to get married. They understood my ambitions, aims and desires. I made it clear to them that I wanted to live independently, on my own terms and conditions. I got a job in 1979, a year after my father passed away, and I started my independent life.
In 1980 I attended the International Atheist Conference held in Vijayawada, Andhra Pradesh. A large number of atheists from all over the world came to that conference. It was organized by the renowned atheist from Andhra Pradesh Sri Goparaju Ramachandra Rao (GORA). I participated in all the programs. I walked on fire to prove that there are no miracles and no maya manthras. If you are bold enough you can walk even on fire. My romance also stated there. It was there that I met my life partner. When I was walking fast on hot coals, at the other end of the field a man extended his hand to me to keep me from falling. He praised my courage. We remained there at the atheist conference for four days and became good friends. A year after that, on Teachers’ day, the 5th of September 1981, we registered our marriage and started living together. I did not want to wear a Mangalasutra or other symbols of a married woman. I never wore bangles.
I never lived in the home of my in-laws. Instead, my husband came to live with me. Those days we managed to live in a two-room house rented for Rs 125/ per month. In fact, we lived in that house for several years. At the time my husband was a junior lawyer earning only 500 Rupees a month. I had a government job and we managed quite well. At present I am living in a big bungalow with a beautiful garden. My husband became a Judge of the Andhra Pradesh High court. I resigned from my job to work full time on Bhumika.. Today Bhumika is a well known feminist magazine. I can say proudly that Bhumika is the best known feminist magazine not only in Andhra Pradesh but in all of South India. All these years I dedicated my whole time to Bhumika, leaving little time for anything else, though I do manage to steal a little time now and then to write a short story. But I don’t have any regrets. I fulfilled my ambition to run a serious magazine for women with a feminist point of view.
All these years I struggled for my Identity. I never changed my surname. I never added my husband’s name or his family name to mine. I am a self-made woman. I never prayed or bowed before anybody or any god for this or that. Whatever I achieved, it was entirely through my determination and hard work. That’s all. I never studied science but I developed a scientific way of living. I respect all religions and I developed a secular way of living. I don’t believe in heaven or hell. I believe there is no hell like war. I hate wars. What is there in heaven? Rambha, Urvashi and Menaka? For whom? For men to enjoy? There is nothing for women even in heaven? It is all man made. He created it for himself. We have to serve these men in heaven too? What kind of heaven is it? In India upper caste (Brahmins) men created this god, heaven, hell and so on to suppress dalits and women. Well, that is a different discussion. Ok
I tried to narrate my story and my achievements as an atheist. I never beg anybody for anything. If I have a dream, I try to fulfill it with my own effort. If I fail the whole responsibility lies with me and me only. If I succeed the sweetness of that success also belongs only to me. Yes, I am the creator of my own “destiny”. I will accept failure and success in the same way. I am always prepared to accept whatever happens to me anywhere, anytime. This is my Philosophy. Atheism gave me this courage and strength. That’s all.


Saturday, November 6, 2010

బోర్ అంటే ఏంటో ఎవరైనా చెబుతారా????



ఈ మధ్య పిల్లల నోట్లోంచి గంటకో సారన్నా వినబడే మాట బోర్ కొడుతోంది అని.
టి.వి చూస్తారు.కాసేపటికి బోర్.
ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తారు గంటకే బోర్.
వీడియో గేం ఆడతారు అరగంటకే బోర్.
కాసేపు క్రికెట్ ఆడి బోర్ అంటారు.
వీళ్ళ సంగతేంటో నాకు అస్సలు అర్ధం కావడం లేదు.
నాకు పిల్లల్ని పెంచడంలో అనుభవం లేదు కానీ
నాకు చాలా చాలా ఆత్మీయుడైన ఓ కుర్రాడున్నాడు.
వాడికి నాలుగు నెలల వయసప్పటి నుండి పరిచయం.
ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
ఆదివారాలు మా ఇంటికొస్తాడు.
శెలవుల్లో మాతోనే ఉంటాడు.
వాడూ నేనూ కలిసి తెగ తిరుగుతాం.
వాల్డెన్ అంటాడు.కేఫ్ కాఫీ డే అంటాడు.
ఈట్ స్ట్రీట్ కెళదామంటాడు.
వాడితో కలిసి నేనూ తిరుగుతూ వాడి కంపెనీని ఆస్వాదిస్తూ ఉంటాను.
అన్నీ అయ్యాకా ఇంటికొచ్చి బోర్ కొడుతోంది అంటాడు.
అరేయ్ ఇప్పటి దాకా తిరిగాం కదా బోర్ ఏంటిరా?బోర్ అంటే ఏంటిరా అంటాను.
ఏమో నాకు తెలవదుకానీ బోర్ కొడుతోంది అంటాడు మళ్ళి.
ఒక్కో సారి ఈ పిల్లల్ల్ని చూస్తే గుండెల్లో కెలికినట్టవుతుంది.
బాల్యం,బాల్యానుభవాలు,ఆటలు,అల్లర్లు కోల్పోయారు.
మాకెన్ని తీపి జ్ఞాపకాలో.
కళ్ళు మూసుకుంటే చాలు సినిమా రీళ్ళల్లా కదలాడే జ్ఞాపకాల దొంతర్లు.
ఒకటా రెండా.ఎన్నో.ఎన్నెన్నో.
కష్టాలు.కన్నీళ్ళు.తీరని ఆశలు.తనివి తీరని అనుభూతులు.
చిన్నాన్నలు ,పెదనాన్నలు,పిన్నమ్మలు, పెద్దమ్మలు మేనత్తలు,మేనమామలు,బావలు అమ్మమ్మలు,నానమ్మలు
అమ్మమ్మ గారి ఊళ్ళో అల్లర్లు.
అసలు బోర్ అనే మాటకి అవకాశం లేనంత సందడి.
తనలోకి తాను చూసుకున్నప్పుడు అపారమైన జ్ఞాపకాలు ఊటలా ఊరుతుంటే బోర్ ఏంటి.
ఇప్పటి పిల్లలకి గాఢమైన అనుభవాలెక్కడివి?ఏదీ గుండెల్లో ఇంకదు.
ఏదీ గాఢానుభూతినియ్యదు.
గుండెల్లో ఇంకనివన్నీ గాలికి కొట్టుకుపోతాయ్.
లోపలంతా లొటారం,ఖాళీ,వెలితి.
ఎంత వస్తు సముదాయంతో నింపితే ఈ వెలితి పూడుతుంది.
సెల్ఫోన్లు,ఐపాడ్లు,టివిలు.ఇంటర్నెట్లు,సినిమాలు,క్రికెట్లు ఇవేవీ పిల్లలకి త్రుప్తి నియ్యడం లేదు.
 లోపలి బోలుతనాన్ని పూరించుకోవడమెలాగో తెలియకే పాపం బోర్ బోర్ అంటూ బేర్ మంటున్నారు
.

Friday, November 5, 2010

ఈ రోజు దీపావళి కదా మా ఊరు తెగ గుర్తొస్తోంది-మా సీతారాంపురం నా ప్రాణం

మా ఇల్లు

 మా సపోటా తోట
మా తమ్ముడి పిల్లలు
ఇద్దరూ ఇంజనీర్లయ్యారు
(దీపాళి పండగ గురించి ఏం చెప్పమంటారు. ఎప్పుడూ డబ్బుల్తో దీపావళి టపాసులు కొనలేదు మేం. అన్నీ మేమే తయరు చేసుకునేవాళ్ళం. పేటేప్‌ కాయలు ( తాటాకులతో చేసేవి), మతాబులు, సిసింద్రీలు, చిచ్చుబుడ్లు అన్నీ చేసేవోళ్ళం. ముడిసరుకులు కొనుక్కొచ్చి తయారు చేసేవోళ్ళం. మతాబులు చేయడానికి ముందు కాగితం గొట్టాలు చెయ్యలిగా. అలాగే సిసింద్రీ గొట్టాలు. కాయితం, అన్నం మెతుకులు వుంటే గొట్టాలు రెడీ. వాటిల్లో మందుకూరి ఎండకి పెట్టేవోళ్ళం. తాటాకుల్ని మెలికతిప్పి, మందుకూరి, వొత్తిపెడితే పెటేప్‌కాయ రెడి. మేం చేసినవి ఫట్‌ ఫట్‌ మని పేలేవి. మతాబులు జలతారు పువ్వుల్ని రాల్చేవి. సిసింద్రీలయితే సుయ్‌మని ఎగిరిపోయేవి. ఇవన్నీ కాకుండా దీపావళికి మేం ఓ ప్రత్యేక వస్తువు తయారు చేసేవోళ్ళం. ఉప్పు, ధాన్యపువూక, పేడ కలిపి ఓ మూటలాగా చేసి తాడు కట్టేవోళ్ళం. మూట మధ్య నిప్పురవ్వేస్తే, ఉప్పు టపటప పేలేది. తాడుతో ఆ మూటని గుండ్రంగా తిప్పితే మనచుట్ట నిప్పుల వలయం ఏర్పడుతుంది. పేడ, వూక కాలుతుంటే ఉప్పురవ్వలు ఎగిసేవి. ఈ ఉప్పు మూట దీపావళికి స్పెషల్‌ ఎట్రాక్షన్‌ తెలుసాండి.)
ఆయ్‌! మాది నర్సాపురమండి. కాదండి... కాదండి నర్సాపురానికి నాలుగు మైళ్ళ దూరంలో వుందండి మావూరు. సీతారామపురం. మా గొప్పూరు లెండి. నిజానికి అదసలు ఊరులాగుండదండి. 'అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరు' అని ఏమనగారు చెప్పినలాంటియ్యేమీ మా వూర్లో లేవండి. ఇప్పటిగ్గూడ మా ఊరికి బస్సు లేదంటే మరి మీరు నమ్మాలండి. నమ్మకపోతే మీ ఇష్టమండి. మా వూర్లోనండి ఏమున్నా ఏం లేకపోయినా బోలెడన్ని తోటలున్నాయండి. మామిడి, జీడిమామిడి, సపోటా, సీతాఫలం తోటలేనండి ఊర్నిండా. ఇక సరుగుడు తోటలగురించి, వాటి ఈలపాట గురించి ఏం చెప్పమంటారు. నే సెపితే కాదండి మీరు ఇనాలండి. తాడితోపులు, కొబ్బరిచెట్లు కూడా ఊరంతా వున్నాయండి.
మా యింట్లో మేం సుమారు 50 మంది పిల్లలుండేవాళ్ళం.ఏసంగి శెలవులొస్తే ఇంకా పెరిగిపోయేవారు. మా తాతకి ఏడుగురు కొడుకులు. ఇద్దరు కూతుళ్ళు. మా చిన్నప్పుడు మేమందరం కలిసే వుండేవాళ్ళం. మా అమ్మ వాళ్ళ్ళ్ళు రోజూ వందమందికి వండి పెట్టేవాళ్ళంటండి. చివరాకర్న ఆడోళ్ళకి ఏముండేది కాదంట. అది వేరే సంగతిలెండి. మరొకసారి చెబుతాను ఆ సంగతులు.
మీరందర జీడిపప్పు బోలెడ్డబ్బెట్టి కొనుక్కుంటారుకదా. మాకైతే ఊర్నిండా జీడితోటలే. మేం పిల్లలందరం కలిసి వేసంగి శెలవులొస్తే కోతుల్లాగా చెట్లమీదే ఎగురుతుండేవోళ్ళం. జీడిపళ్ళు చీక్కుంట, గింజల్ని చెట్లకిందే కాల్చుకుంట, జీడిపప్పు తెగ తినేవోళ్ళం. ఇప్పుడేమో కొలస్ట్రాలని భయపెడుతున్నారుగాని మేం తిన్నంత జీడిపప్పు ఎవ్వరూ తినుండరంటే నమ్మండి. మా కూరల్నిండా పచ్చిజీడిపప్పే. చింతచిగురు, మామిడి కాయ, వంకాయ కోడిగుడ్లు అన్నింట్లోను కలిపేసుకుని వండేసుకునేవాళ్ళం. చింతాకు జీడిపప్పు కూర రుచి నే చెబితే ఏం తెలుస్తుంది. తిని చూడాలంతే.
వేసంగి శెలవుల్లో మా పిల్లమూకంతా ఆడపిల్లలైతే లంగాలకి కచ్చాలుపోసి, మొగపిల్లలైతే జేబుల్లోకి గంపెడేసి చింతచిగురు కోసి కుప్పలు పోసేవోళ్ళం. చిటారుకొమ్మల్లోకి పాక్కున్టూ వెళ్ళిపోవడం బలే మజాగా వుంటుంది. చింతాకు ఉడకబెట్టి బిళ్ళలు చేసేవోళ్ళు. ఆకు ఎండబెట్టి డబ్బాల్లో పోసేవోరు. మాకు సంవత్సరమంతా చింతాకు, చిన్తపరిగెలు, మెత్తళ్ళు,చిత్తడాయిలు, చెంగుడుపట్టు- ఇయ్యన్ని ఏంటీ అనుకుంటున్నారా? చేపలండీ బాబు చేపలు. ఈ చేపలన్నీ చింతాకుతో కలిపి ఒండుకుతింటే ఇంకేమీ ఒద్దనిపిస్తదండి. మీరు కూడా పశ్చింగోదావరి వాళ్ళయితే ఇయ్యన్నీ ఈజీగా తెలిసిపోతాయండి.
ఏసంకాలంలో మామిడి పళ్ళతోపాటు మాన్చి రుచైన పండు మరోటుందండి. మీరెప్పుడైనా తాట్టెంక తిన్నారా? చెట్టుమీద ముగ్గిన తాటి పండు నిప్పులమీద కాల్చుకుని తిన్నారంటే..... ఎందుకులెండి వర్ణిఅమ్చడం. మీరెరూ తినుండరు. పోనీ కుంపటేసిన తేగలన్నా తిన్నారా లేదా? కనీసం బుర్ర గుంజయినా తిన్నారా? తినుంటే మాత్రం వందేళ్ళొచ్చినా ఆ రుచుల్ని మర్చిపోవడం వుండదండి. సరే. మా ఊరినిండా పళ్ళతోటలే కాదండి కూరగాయల పాదుల ఎక్కువేనండి. వంకాయలు, దొండకాయలు, బీర, సొర, పొట్ల, గోరుచిక్కుళ్ళు, టమెటాలు, పచ్చిరగాయలు, గోన్గూర, తోటకూర ఒకటేమిటి అన్నీ పండిస్తాం. వీటన్నింటికి నీళ్ళెక్కడినించొస్తాయా అని ఆలోచిత్తన్నారా ఏంటి? నుయ్యిలు తవ్వుతారు. పదడుగులు తవ్వితే చాలు బుడబుడమని నీళ్ళూరిపోతాయి. రెండు కుండల్లాంటివుంటాయి. వాటిని బుడ్లజోడంటారండి. ఈ బుడ్లజోడుని నూతుల్లోని నీళ్ళతో నింపి కూరపాదులకి నీళ్ళుపోస్తారు. బుడ్లజోడుతో నీళ్ళపోత అంటారు సిపుల్‌గా.
మా నాన్న చాలా కష్టజీవి. గోచిపెట్టుకుని బుడ్ల జోడుతో పాదులకి నీళ్ళపోతపోసి, పచ్చిగడ్డి కోసుకుని ఇంటికొచ్చి అలిసిపోయి అలానే వీధరుగుమీద పడి నిద్రపోయేవాడు. నేను నాన్నతో కలిసి పాదుల్లో పనిచేసేదాన్ని. గొడ్డలితో కట్టెలు కొట్టేదాన్ని. పాలు పితికేదాన్ని.నూతుల్లో దిగి బోలెడన్ని చేపలు పట్టేదాన్ని. ఎపుడూ ఊరిమీద బలాదూర్‌ తిరిగేదాన్ని. నువ్వాడపిల్లవి. ఇలాంటి పనులు చెయ్యకూడదు అని ఏనాడూ మా నాన్న నాకు చెప్పలేదు. నేనేం చేసినా అడిగేవోడు ఎవ్వడూ లేడనుకోండి.
ఓసారి నూతిలో దిగి చేపలు పడుతుంటే సీసాపెంకు గుచ్చుకుని ఒకటే రక్తం. నేనేం భయపడలేదు. ఆ నూతుల్లోనే వున్న మెట్టతామరాకు ముద్దగా చేసి తెగిన చోట పూసేసానంతే. తెగిందని ఆరోజు ఎవ్వరికీ చెప్పలేదు. కానీ ఈ రోజుకి నా ఎడం చేయి మణికట్టు దగ్గర ఆ మచ్చ అలాగే వుండిపోయి, ఆ అల్లరి రోజుల్ని గుర్తుచేస్తంటుంది. తేగబుర్రల్ని కత్తితో కొడుతుంటే తెగిన మచ్చ కూడా ఎడం చేతి చూపుడు వేలు మీద వుందండోయ్‌. మరేంటనుకున్నారు. ఆ మచ్చల వెనక ఇంత మహా చరిత్ర వుందిమరి.
తోటలెంబడి తూనీగలాగా తిరుగుతుండేదాన్ని కదా! నాకు బయమంటే ఏంటో తెలియదండి. కాని ఒక్క బావురుపిల్లికి మాత్రం తెగ భయపడేదాన్ని. మా యిల్లు రైలుబండంత పొడుగుండి చాలా పెద్దమండువా ఇల్లండి. బోలెడంత పెరడు వుండేది. గుమ్పులుగా కోళ్ళు తిరుగుతుండేవి. ఈ కోళ్ళ కోసం రాత్రిళ్ళు బావురు బావురంటూ బావురుపిల్లి వచ్చేదండి. కోళ్ళు గూళ్ళో దూరి కోడినెత్తికెళ్ళి తినేసేది. పిల్లొచ్చినపుడు కోళ్ళు గోల గోలగా అరిచేవండి. నా గుండెల్లో రైళ్ళు పరుగెట్టేవి. గుడ్లు మిటకరించి అటకమీదికి చూస్తుండేదాన్ని. అటకమీంచి బావురుపిల్లి నా మీదికి దూకేస్తుందని తెగ భయపడేదాన్ని. నేనెంత మొద్దునంటే పిల్లిక్కావలిసింది కోడిగాని నేను కాదుగా. అది ఈ మొద్దుబుర్రకు అర్తం కాడానికి చాలా కాలమే పట్టింది. అదండి సంగతి.
మా వూర్లో నాకు ఎక్కువ యిష్టమైంది, ప్రాణప్రదమైంది అమ్మోరి తీర్తం. మా వూరి దేవత పేరు మారమ్మ. సంవత్సరానికి ఒకసారి జాతర చేస్తారు. తీర్తం పదిరోజులుందనగానే పిల్లల హడావుడి మొదలయ్యేది. తాటాకులు కోసుకొచ్చి బుల్లి బుల్లి బుట్టలల్లేవాళ్ళం. వీటిని జాజారి బుట్టలు అనేవాళ్ళు. ఒక్కొక్కళ్ళకి రెండేసి బుట్టలన్నమాట. బుట్టల్లో మట్టి నింపి నవధాన్యాలు వేసి నీళ్ళు పోసేవాళ్లం. పొద్దున లేవడం బుట్టలన్నీ వీధరుగుమీద పెట్టుకుని మొలకలొచ్చినయ్య లేదా అని చూసుకునేవాళ్ళం. అన్నింటి కన్నా ముందు పెసల మొక్కలొచ్చేవి. తీర్తం నాటికి జాజారి బుట్టల్నిండా పచ్చటి మొక్కలు గుబురుగా వచ్చేసేవి. తీర్తం నాటిముందు రోజు రాత్రి ఆసాదులు మోళీ కట్టేవాళ్ళు. ఆసాదులంటే ఎవరో చెప్పలేదు కదా! మారమ్మ తీర్తంలో ఘటాలనే గరగలంటారు. ఈ ఆసాదుల గరగల నృత్యం చూసి తీరాల్సిందే. మాదిగడప్పుకు అనుగుణంగా వారు వేసే స్టెప్‌లు, ఏ మెగాస్టార్‌ కూడా వెయ్యలేదండోయ్‌. ఆ... అన్నట్టు మెగాస్టార్‌ మా వూరివాడేనండి. మా బస్సులోనే వచ్చి మాకు బీటేసినవోడేనండోయ్‌. ఆ ముచ్చట మరోసారి చెబుతాలెండి. ఈ ఆసాదుల మోళీ అబ్ధుతంగా వుంటుంది. మోళీ అంటే మరేం కాదండి మేజిక్‌ అన్న మాట. మనిషి నెత్తిమీద నల్ల దుప్పటి కప్పి, పొయ్యేట్టి పకోడీలువొన్డేసేవోరు. జేబుల్లోంచి రూపాయల కట్టలు లాగి దండల్లాగా మెళ్ళో వేసుకునేవోళ్ళు. పేకముక్కల్ని ఫెవికాలెట్టి అంటించినట్టు సర్రున ఎగరేసేవోళ్ళు. మేం పిల్లలం నోళ్ళు ముయ్యడం మర్చిపోయి మొద్దురాచ్చిప్పల్లా చూస్తుండిపోయేవాళ్ళం. పి.సి. సర్కార్‌ మేజిక్‌ షో వాళ్ళముందు పనికిరాదంటే నమ్మండి.
ఇంక తీర్తం రోజు సంగచ్చెబుతాను. తలంటుస్తానం చేసేసి, వుంటే కొత్తబట్టలేసేసుకుని ఆసాదుల రాకకోసం ఎదురుచూత్తా కూచొనేవాళ్ళం. డప్పుల హోరుతో ఆసాదులెళ్ళి ఊరి పొలిమేరల్ని కట్టేసి వచ్చేవోళ్ళు. ఆసాదుల వెంటపడి రెండు చేతుల్లో పచ్చటి జాజారి బుట్టలతో మిడతల దండులాగా పిల్లల గుంపు. బుట్టలో జానేడేసంత పచ్చటి మొక్కలు. ఆసాదులు గరగల నృత్యంతో ముందుకెళుతుంటే వాళ్ళ వెనకాల మేము. గుడి వరకూ అలా వెళ్ళి బుట్టల్ని గుడిచుట్టూ తిప్పి గుడి గోపురం కింద అంచుల మీద పెట్టేసేవోళ్ళం. గుడంతా పచ్చగా కళకళల్లాడిపోయేది. అసలు పిల్లలు బుట్టల్తో నడుస్తుంటే పచ్చటి తివాసీని మోసుకెళుతున్నారా అన్నంత ఆకుపచ్చగా వుండేది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా కళ్ళకి ఆ పచ్చదనం అగుపిస్తుందంటే మీరు నమ్మితీరాలి మరి.
వినాయక చవితికి కూడా మేం ఎండుపల్లేరుకాయల్ని మూటగట్టి ఇంటికొచ్చే కొత్తల్లుళ్ళని తెగ బెదిరించేవాళ్ళం. మా అల్లరికి బావలు పరుగో పరుగు. అల్లుళ్ళని చాలా రకాలుగా ఏడిపించే వాళ్ళం. ఆకునిండా భోజనం పెట్టి, ఆకు కింద ఆవాలు పోసి, సన్నటి తాడుకట్టి ఆయన భోజనానికి కూర్చుని తినడం మొదలెట్టగానే ఆకుని లాగేసేవాళ్ళం. కింద ఆవాలుంటాయిగా ఆకు ఈజీగా కదిలిపోయేది. ఇంటల్లుడి ముఖం చూడాలి. అందరం గొల్లున నవ్వేవాళ్ళం. అలాగే గారెల్లో బండారు గాజులెట్టి అల్లుడికి పెట్టేవాళ్ళు. ఆయన ఆనందంగా గారెలు లాగించబోయేసరికి గాజు గట్టిగా పళ్ళకి తగిలి బెంబేలెత్తిపోయేవాడు. మేం నవ్వుకుంటూ గాజుకు సరిపడా డబ్బులివ్వాలని ఆటపట్టించేవాళ్ళం. ఇవన్నీ పండగ సరదాల్లో భాగమేనండోయ్. పండగ సంబరాలు ఎంత రాసినా తనివి తీరదు . ఉగాదికి అరకలు కట్టి దున్నడాలు, సంగ్రాంతికి దుంలెత్తుకొచ్చి భోగిమంటలేయడాలు, కార్తీక వమాసం చలిరోజుల్లో తెల్లవారు ఝామునే గోదావరిలో మునగడాలు, అట్లతద్దికి ఉయ్యల లూగడాలు ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో సంబరాలు.
మావూరి గొప్పదనం గురించి ఇంకేం చెప్పమంటారండి బాబు! మాకు ఒక వేపు గోదారి. మరోవైపు సముద్రం. గోదావరి నాలుగు కిలోమీటర్ల దూరంలో వుంటే పది కిలోమీటార్ల దూరంలో సముద్రం. నా బతుకు మా వూరి పచ్చదనంతోటి, మా వూరి చుట్టు వున్న నీళ్ళతోటి ముడిపడిపోయింది. వెన్నెల్లో గోదారి మీద లాంటి ప్రయణం, అంతర్వేది రేవు, అన్నాచెల్లెలగట్టు, కొనసీమ కొబ్బరి చెట్లు ఇవన్నీ నా జీవితంలో అంతర్భాగాలు. నా బాల్యం ధగధగ మా గోదారి గట్టుమీద సూర్యబింబం మెరిసినట్టు మిరుమిట్టు గొలుపుతుంటుంది.
నేనేం టాటాలు, బిర్లాల్లాగా నా నోట్లో బంగారపు చెంచా పెట్టుకునేం పుట్టలేదు సుమండి. నేను పుట్టింది ధాన్యపు కొట్లోనంట. మా అమ్మ నిండు నెలల్తో ధాన్యపు కొట్లోంచి ధాన్యం తీస్తోందట. అమాన్తం నేను పుట్టేసానంట. కొవ్వాసు పీసు ( ఒక రకం చేప) లాగా వుండి ఈరోజో రేపో అన్నట్టుండేదాన్నంట. నా కర్మకాలి నే పుట్టిన పద్నాలుగో రోజే మా అమ్మమ్మ చచ్చిపోయిందంట. నా చదువుకూడా అంతే. మా వీధరుగు మీదే బడి వుండేది. బుద్ధిపుడితే కూర్చునేదాన్ని. లేకపోతే చెట్లెక్కేదాన్ని. టీకాల వాళ్ళు వస్తే మాత్రం నేను చిక్కడు, దొరకడు. చిటారు కొమ్మల్లోకి ఎక్కి కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయాక దిగేదాన్ని. నా కెవరన్నా భయముండేది కాదు కాని టీకాల వాళ్ళంటే ఆ సూదులు చూసి భయమేసేది.
నా కెందుకు, ఎలా, ఎపుడు పుట్టిందోగాని చదువుకోవాలనే కోరిక మాత్రం పుట్టేసింది. మా కుటుంబంలో అటు ఇటు చదువుకున్న వోళ్ళే లేరుమరి. నాకెలా పుట్టిందో తెలియదు. చదువుకోసం ఎంతో పోరాటం చేయాల్సివచ్చింది. మా నాన్నకి నన్ను చదివించాలనే వుండేది కాని డబ్బుల్లేవు. ఉమ్మడి కుటుంబానికి ఆయన చాకిరీ చేసేడు గాని చిల్లి కాని కూడా వుండేది కాదు. నా చదువు సమాచారం క్లుప్తంగా చెబుతాను. అయిదు వరకు ఊర్లోనే చదివాను. ఆరునించి పదివరకు ఓరియంటల్‌ స్కల్‌. అంతా సంస్కృతం మయం. మా సంస్కృతం మేష్టారు శ్లోకం తప్పు చదివితే స్కల్‌ చుట్టూ తిప్పి కొట్టేవోరు. ఒకసారి నేను ఆయనకి దొరక్కుండా బాదం చెట్టెక్కి కూర్చున్నా. ఆయన కోపం ఆపుకోలేక గోడకేసి తలబాదుకున్నాడు. నేను కిందికి వచ్చేసాను గాని ఆయన నన్ను కొట్టలేదు. నేను టెంత్‌ వరకు సంస్కృతం, ఇంటర్‌లో తెలుగు లిటరేచర్‌, డిగ్రీలో ఇంగ్లీషులిటరేచర్‌ చదవడమ్ వల్ల సాహిత్యం మీద వల్లవలిన ప్రేమనాకు.
మళ్ళీ ఓసారి మా ఊరి కెళదావ! మా ఊరికి బస్సులేదని ముందే చెప్పానుకదండి. నడవాల్సిందే! పదండి నడుద్దాం. కాలవ దగ్గర ఎర్ర బస్సుదిగి నడవడం మొదలెడితే మీకు ఇళ్ళేం కనబడవు. ఒక వేపు జీడితోటలు, మరోవేపు సరుగుడు తోటలు. ఆ తోటల్లో పడి ఓ మైలున్నర నడిస్తే మా ఇల్లొస్తుంది. ఆ.... అన్నట్టు మీకు ఇంకో రహస్యం చెప్పడం మర్చిపోయా. ఎవరికి చెప్పకండేం. ఎండు సరుగుడాకులు చూసారా ఎపుడైనా? ఎండిపోయిన సరుగుడాకుల్ని తెల్ల కాగితాల్లో చుట్టుకుని గుప్‌ గుప్‌ మని పీల్చి పొగవొదిలేవాళ్ళం. హమ్మ! ఎంత రౌడీ పిల్లలు అని ముక్కుమీద వేలేసుకుంటున్నారా? 'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' అని మహాకవే అన్నాడు నాదోలెక్కా. మాకు సిగరెట్లు తయరు చేయడం ఎంత సులువో తెలిసిపోయింది. మాకు నోబుల్‌ ప్రైజ్‌ ఇవ్వాలికూడా.
మీకు మరోరహస్యం కూడా చెబుతానండి. ఎవరితోనుచెప్పకండి. మా నాయనమ్మ రోజూ పొద్దున్నే మాన్చి్ పోత్తాడి కల్లు ముంతలు ముంతలు లాగించేదంటండి. మీకు ఇంకో సీక్రెట్టు చెప్పేస్తున్నాను. కాచుకోండి. మేం కూడా తాటాకు దొన్నుల్లో నింపుకుని పోత్తాడి కల్లు తాగేసేవోళ్ళమండి. మా ఇంటెనక ఓ పోత్తాడి వుందండి. దాని కల్లు భలే తియ్యగా వుండేదండి. కల్లు అనగానే చాలా మంది మొకాలెందుకో తుమ్మల్లో పొద్దుగకినట్టయిపోతాయి. ఎందుకో నా కర్థమే కాదు. ముంజలు మాత్రం జుర్రుకుంట తినేస్తారు కాని కల్లంటే ఆముదం తాగిన మొకాలు పెడతారు. కల్లంటే కల్తీ కల్లనుకుంటున్నారా ఏంటి కొపదీసి. కాదండి బాబూ! మా వూరి ఈడిగ ఎంకట్రావుడు కల్లు తీస్తాడు. తెల్లారగట్లే అతను చెట్టెక్కడం మనం చెట్లకింద చేరడం. ఫ్రెష్‌. తాగితే అపుడే దింపిన కల్లే తాగాలండి. లేకపోతే యమ డేంజర్‌. కొబ్బరి నీళ్ళలాగానే వుంటదండి. ఒట్టండి. ఆరోగ్యానికి అపుడే తీసిన కల్లు చాలా మంచిదని మా ఎంకట్రావుడు చెపుతాడండి. ఇదండి మావూరి కల్లు బాగోతం.
మీరందరూ గోలీకాయల్తో గోలీలాడితే మేమ్ జీడిపిక్కల్తో గోలీలాట ఆడి బోలెడు జీడిగింజల్ని సంపాదించేవాళ్ళం. ఆ తర్వాత వాటిని అమ్మి డబ్బులు సంపాదించేవాళ్ళం. పుస్తకాలు కొనుక్కోవాలికదా! డబ్బులంటే గుర్తొచ్చింది. మేం డబ్బులు కూడా తయరు చేసేం. ఫెయిలయామనుకోండి. చిల్ల పెంకుల్ని గుండ్రంగా అరగదీసి సిగరెట్‌ పెట్టెల్లో వుండే ముచ్చిబంగారం అంటించి కొట్టుకు తీసుకెళ్ళి ( రాత్రిపూట) నిమ్మతొనలిమ్మంటే, చిల్లపెంకుల్ని తీసుకుని మా వీపుల్ని విమానంమోత మోగించిన విషయం గుర్తొస్తే చచ్చేంత నవ్వొస్తుంది నాకు. ఇంకా బలుసుచెట్ల కొమ్మలకుండే ముళ్ళకి నేరేడు పండ్లు గుచ్చి ద్రాక్ష గుత్తుల్లా చేసినా, పుంతలోని ఇసకలో ఉసిరి కాయల్ని కప్పెట్టి మర్నాడు తొనలు తొనలుగా వొలుచుకుతిన్నా, బ్రహ్మజెముడు కాయల్ని కాళ్ళంతా పూసుకుని అమ్మోరక్తం అని గగ్గొలు పెట్టినా, పిచ్చికాయలు, తాటాకు కలిపి నమిలి కళ్ళీ కన్నా ఎర్రగా నోరు పండించుకున్నా ఇదంతా మా అల్లరిలో భాగమైనా మా సృజనాత్మకతకి పునాదులని నేననుకుంటాను.
అందుకే మా ఊరంటే ప్రాణం నాకు. నాకు బంగారు బాల్యాన్నిచ్చిన మా సీతారామపురం నా లైఫ్‌ లైన్‌. ఊరుకుండాల్సిన లక్షణాలు లేని ఊరు కాబట్టి నేనాడింది ఆట పాడింది పాటగా సాగింది. దళితులు, రాజులు, కాపులు తప్ప వేరే ఏ కులం వాళ్ళూ మా వూళ్ళో లేరు. దళితుల అణిచివేత విషయంలోమా ఊరేమీ మినహాయింపు కాదు.  దొంగతనాలంటగట్టి దళితుల్ని గుంజలక్కట్టేసి కొట్టిన ఉదంతాలు చూచాయగా గుర్తున్నాయి. పాలేర్ల పెళ్లాల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళూ వున్నారు. . ఇవన్నీ నాకు పెద్దయ్యాక తెలిసిన నగ్న సత్యాలు. వీటికి, మా వూరిలో నాకున్న అనుబంధానికి ఏం సంబంధం లేదు. పైరు పచ్చల్తో కళ కళలాడే మా ఊరు, ఎత్తైన అరుగుల్తో గంభీరంగా వుండే మా యిల్లు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో సజీవంగా వుంటాయి.
ఇవండి మా ఊరి సంగతులు. ఇవన్నీ చదివేక మీరు నా బాల్యానుభవాలని ఆడపిల్ల మగపిల్లాడు సున్నితపు తాసులో కొలుత్తారని నాకు తెలుసండి. కల్లు తాగడాలు, సరుగుడు సిగరెట్లు పీల్చడాలు, గొడ్డళ్ళతో కట్టెలు కొట్టడాలు, చిటారుకొమ్మల్లోకి ఎగబాకడాలు, చేపల్ని పట్టుకోవడాలు ఇయ్యన్నీ జనం దృష్టిలో మగానుభవాలు. మగపిల్లలు మాత్రమే చేయల్సిన పనులు. ఆడపిల్లలక్కూడా ఇలాంటి బాల్యం వుంటుందంటే నమ్మరేమో! మనోళ్ళ దృష్టిలో ఆడపిల్లలు ఎచ్చనగాయలూ, వోమన గుంట్లూ ఆడాలి. లక్కపిడతలాటలూ, బొమ్మల పెళ్ళిళ్ళాటలు ఆడాలి. అమ్మలెనక వొంటింట్లో తిరిగి వొంటల్నేర్చుకోవాలి. తమ్ముళ్ళని చెల్లెళ్ళని ఎత్తుకు మోయలి. అడ్డగాడిదలు అన్నలు, తమ్ముళ్ళు తిని తేన్చిన కంచాలు ఎత్తాలి. వినయ విధేయతల్తో నడుములు, మెడలు వొమ్చేసి పెళ్ళికి సిద్ధంగా వుండాలి. అంతేకాని నాలాగా స్వేచ్ఛగా, పక్షిలాగా బయటే తిరగడం, నా కిష్టమైన అన్ని పనుల్ని అడ్డూ, అదుపూ లేకుండా చేసేయడం అబ్బో! చాలా మందికి కంట్లో నలకపడ్డట్లే.
చివరగా మా దొంగతనాల సంగతుల్జెప్పేసి ముగించేత్తానండి. మా వూర్లో బోలెడన్నిమామిడి తోటలున్నాయని చెప్పేనుకదండి. పచ్చిమామిడికాయలు మాకు బాగానే దొరికేవి కాని పండ్లు చిక్కేవి కాదు. మామిడి కాయల్ని ఎడ్లబండి మీద తీసుకొచ్చి మా తాతకు అప్పచెప్పేవోరు. మా తాత వాటన్నింటిని ఓ పెద్ద గదినిండా పోయించి పండింతర్వాత, కొంచం కొంచం డాగుపడ్డ పళ్ళనే బయటకు తెచ్చి ఇచ్చేవోడు. మాకు చాలా కోపమొచ్చేది. ఒక్క మంచి పండు ఇయ్యొచ్చు కదా అనుకునేవోళ్ళం. చచ్చినా ఇచ్చేవోడు కాదు. మరి మేం తక్కువోళ్ళమా? సరుగుడు కర్రల చివర్న సూదివాటంగా చెక్కి కిటికీల్లోంచి పళ్ళు లాగేసేవోళ్ళం. ఆ గది కిటికీకి రెండు చువ్వల్లేకపోవడం మా పనెంతో సులువుగా అయిపోయేది. బోలెడన్ని మామిడి పండ్లు దొంగతనంగా లాగేసి తినేసేవోళ్ళం. మామిడిపండ్లు ఏమైపోతున్నాయో అర్తం కాక మా తాత జుట్టు పీక్కునేవోడు. ఇక మారెండో దొంగతనం భోగిమంటల కోసం దుంగలు ఎత్తుకురావటం. పొయ్యికిందికి దాచుకున్న కట్టెల్ని ఎత్తుకొచ్చి భోగిమంటల్లో పడేసేవోళ్ళం. ఓసారి పెద్ద గొడవైపోయింది. రామాయమ్మని ఒకామె వుండేది. ఆమె పోట్లాట మొదలెట్టిందంటే ఓ పగల ఓ రాత్రీ నడిచేది. చెంబునిండా నీళ్ళు పెట్టుకుని అవి తాగుతూ మరీ తిట్టేది. దుంగలెత్తుకొచ్చామని మమ్మల్ని దుంపనాశనం తిట్లెన్నో తిట్టి మా చిన్నానతో కొట్టించింది.
ఇలా రాసుకుంటపోతే ఈ వ్యాసం కొండపల్లి చెంతాడంత పొడుగైపోతాది. అవకాశం దొరికితే తరువాయి భాగం మళ్ళెప్పుడన్నా వినిపిస్తాలెండి. ఇంకా చానా సంగతులున్నాయి మరి.
నేను ఇప్పటికే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసేసాను. ఏభై ఏళ్ళు వచ్చేసినా నా బాల్యం నా కళ్ళకి నవనవోన్మేషంగా కన్పిస్తూనే వుంటుంది. నా పెదాల మీద తురాయి పువ్వుల్ని పూయిస్తూనే వుంటుంది. మ ఊరు జున్నుముక్కలా నన్ను ఊరిస్తనే వుంటుంది. మా సపోటతోట నూతిలోని తెల్లని కలువపూలు నన్ను రా రమ్మని పిలుస్తనే వుంటాయి.
మరింక శెలవుచ్చుకుంటానండి. మా ఊరంటే మీకూ ప్రేమ పుట్టే వుంటుంది. మీరందరూ కూడా మా ఊరిని, నాకు ప్రాణప్రదమైన మా సీతారామపురాన్ని ప్రేమించాలని కోరుకుంటూ

Tuesday, November 2, 2010

జండర్‌ స్పృహ లోపించిన సర్వోన్నత న్యాయస్థానం

అక్టోబరు 20 యావత్‌ భారతదేశంలోని మహిళల్ని గాయపర్చిన దినం. కించపరిచిన, అవమానపరిచిన దినంగా  ఈ కంఠంలో ప్రాణం వున్నంతకాలం గుర్తుండిపోతుంది. ఎవరో సాధారణ పౌరులో, సామాన్య వ్యక్తులో దీనికి కారణం కాదు.అలాగని సామాన్య వ్యక్తులు చెయ్యెచ్చని అర్ధం కాదు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, భారతీయ మహిళల్ని ''ఉంచుకున్నవాళ్ళు''గా వ్యాఖ్యానించి, స్త్రీలని భార్యలుగా, ఉంచుకున్నవాళ్ళుగా, ఒక్క రాత్రి గడిపి వెళ్ళిపోయే వాళ్ళుగా విడదీసి వ్యాఖ్యానించింది. వివాహానికి వెలుపల బతుకుతున్న కోట్లాది మంది గుండెల్ని గాయపరచడమే
 కాక చాలా తిరస్కార భావంతో అవమానపరిచింది. ముష్టి రూ. 500 భరణం కోసం పచ్చియమ్మాళ్‌, వేలుసామికి 'ఉంచకున్నది'గా ముద్ర వేయించుకోవలసి వచ్చింది. కలిసి బతికామని, తనకు భరణం ఇప్పించాలని న్యాయస్థానాలను ఆశ్రయించిన ఆమె భయంకరమైన ముద్రను భరించాల్సి వచ్చింది.

ఈ తీర్పును వెలువరించిన న్యాయమూర్తులు జస్టిస్‌ మార్కండేయ కట్జు, జస్టిస్‌ టి.ఎస్‌.ఠాగూర్‌లు తాము 21 వ శతాబ్దంలో బతుకుతున్నామనే స్పృహని కోల్పోయి 'కీప్‌' అనే పదాన్ని వాడి, తమకి జెండర్‌ సెన్సిటివిటీ లేదని నిరూపించుకున్నారు. మహిళల్ని కించపరచడంలో, అవమానపరిచే వ్యాఖ్యల్ని చెయ్యడంలో వీరే ఆద్యులు కారు. అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రంగనాధ మిశ్రా కూడా అపర మనువులో మాట్లాడి, కోట్లాది స్త్రీల క్రోధాగ్నిని చవి చూసి, తోక ముడిచి క్షమాపణ చెప్పాడు. ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నట్లు, పుచ్చిపోయిన భావాలతో, పురుషాంకారంతో ఈ ఇరువురు పునరపి... అంటూ మళ్ళీ మహాపరాధం చేసారు. నిండు కోర్టులో నిరసన తెలిపిన ఇందిరా జైసింగును నిలువరించే సాహసం చేసారు. తాము వాడిన పదాల గురించి ఆమె చేసిన ఆక్షేపణని పట్టించుకోకుండా 'కీప్‌' కాకపోతే 'కంకుబైన్‌' అనొచ్చా అని ఆమెనే అడిగి తమ అహంకారాన్ని వెల్లడి చేసుకున్నారు. మహిళల్ని అవమానించడానికి వీళ్ళకి ఎవరు అధికారమిచ్చారు? ఒక న్యాయమూర్తో, మరో వైస్‌ ఛాన్సలరో, ఇంకో మత పిచ్చివాడో తమ కిష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? వేల సంవత్సరాలుగా ఉచ్చులు బిగించి, ఇనప కచ్చడాలు తగిలించి మహిళల బతుకుల్ని శాసించిన పితృస్వామ్య భావజాలానికి ప్రతినిధులుగా ఇంకా ఇంకా అణిచివెయ్యాలని కుట్రలు పన్నుతున్న వీళ్ళు అత్యున్నత స్థానాలో అలవారడం ఎంత అవమానకరం?

నిన్నటికి నిన్న ఒక వైస్‌ ఛాన్సలర్‌ హిందీ రచయిత్రలను 'వేశ్య' అని దూషిస్తూ తన కండకావరాని వ్యక్తం చేసాడు. హిందీ భాషలలో రాస్తున్న స్త్రీలు తమ అనుభవాలను, అభిలాషలను తమ రచనల్లో వ్యక్త్తీకరించడం ఈ పెద్ద మనిషి దృష్టిిలో నేరమైంది. మగవాళ్ళు ఎలా రాసినా, బూతు రాసినా, భూత ప్రేత పిశాచాల గురించి రాసినా, పచ్చి శృంగారం గురించి రాసినా వాళ్ళు మహారచయితలుగా చలామణి అవుతారు. మహిళలు మాత్రం దూషణ, తిరస్కారాలకు గురవుతారు. ఫ్యూడల్‌ సమాజపు తిట్లన్నీ ఉపయోగించి వారు మరి కలం పట్టకుండా అణచివెయ్యాలని చూస్తారు. ఎనభైలలో తెలుగు సాహిత్యం లో కూడా ఈ సంఘటనలు జరిగాయి. స్త్రీవాద రచయిత్రుల మీద పధకం ప్రకారం దాడి జరిగింది. నోటితో ఉచ్ఛరించజాలని తిట్లని వాడిన వాళ్ళు మామూలు రచయితలు కారు. అభ్యుదయ, విప్లవ రచయితలుగా చెలామణి అవుతున్న వాళ్ళు. అసలు స్త్రీలకు సంబంధించిన ప్రతి అంశంలోను తలదూర్చి, కట్టు, బొట్టు, మాట, రాత, నడత, ఆలోచన, ఆచరణ - వీటన్నింటినీ నియంత్రించాలనే అధికారాన్ని వీళ్ళకెవరిచ్చారు. ప్రతీ అంశం మీద పోలీసింగు చేస్తూ, మహిళల కదలికల్ని ఆలోచనల్ని అణచివెయ్యాలని ప్రయత్నించే వీళ్ళు ఏ కాలానికి ప్రతినిధులు?

భారతీయ భాషలన్నింటిలోను మహిళల్ని కించపరిచే, అవమాన పరిచే పదాలు, వ్యక్తీకరణలు లక్షల్లో వున్నాయి. మగవాళ్ళు పరస్పరం తిట్టుకోవాలన్నీ వాళ్ళు అమ్మ అక్క, ఆలి లను తిట్టాల్సిందే. వాళ్ళు జననాంగాలను కించపరచాల్సించే. 'నీకు సంబంధించిన స్త్రీలపై అత్యాచారం చేస్తాను జాగ్రత్త' అనే అర్ధంతోనే తిట్లు వుంటాయి. మగవాడు తన అధికార దర్పాన్ని అణిచివేత బుద్ధిని తన తిట్లద్వారానే వ్యక్తం చేస్తాడు. అదే పద్ధతిలో స్త్రీలను విడగొట్టి ధర్మపత్ని అని, వేశ్య అని, ఉంచుకున్నది అని అవమానించడం సర్వ సాధారణమైంది. మరి మగవాళ్ళు మాత్రం ధర్మపత్ని, అధర్మపతి, ఉంచుకున్నవాడు, తిరుగుబోతు లాగా విభజింపబడరు. వాడు మగాడు అంతే ఈ భావజాలం నరనరాన నింపుకున్న న్యాయమూర్తులు ఏ మాత్రం సంకోచించకుండా 'కీప్‌' 'రఖౌల్‌'లాంటి పదాలను వాడారు. ఇంత జెండర్‌ ఇన్‌సెన్సిటివీని అత్యున్నత న్యాయస్థానంలో ఊహించడమే కష్టం. కళ్ళారా చూసాక, చెవులారా విన్నాక మనసు తీవ్రంగా గాయపడింది. భగ్గున మండింది. 50 కోట్ల మంది మహిళల్ని కలిచివేసిన సంఘటన ఇది.

అన్ని భాషల్లోను ఇలాంటి అవమానకర పదాలున్నాయి. తెలుగు వరకు చూస్తే పురుషులు స్త్రీల మీద అత్యంత హీనంగా, హేయంగా ప్రేయోగించే ఒక నేరం గురించి, అమానుషమైన అత్యాచారం గురించి - మానభంగం, చెరచడం, అనుభవించడం లాంటి పదాలు ఉపయోగిస్తారు. ఈ పద ప్రయోగంలో వున్న వివక్ష గాని అవమానంగానీ పట్టించుకోరు ఈ పద ప్రయోగాల వల్లనే లైంగిక అత్యాచారానికి గురైన స్త్రీలని పాడై పోయిన స్త్రీలగా, చెడిపోయిన స్త్రీగా ముద్ర వేసి ఆమె బతుకును బలి తీసుకుంటారు. చెడిన పురుషుడు చెడిపోయినవాడు కాదా? వాడు శృంగార పురుషుడు శ్రీ కృష్ణుడు అంటూ బిరుదులివ్వడం. ఇందెంత దుర్మార్గమో ఆలోచించండి.

ఇంత కన్నా చెత్త పదాలు- ముతైయిదువ, అయిదోతనం, సౌభాగ్యవతి, విధవ, అబల, సౌశీలవతి, శీలం, గొడ్రాలులాంటి అవమానకరపదాలు తెలుగు భాష నిండా వున్నాయి. వాటిని యధేచ్ఛగా, సంకోచం లేకుండా వాడుతూనే వున్నారు. ''నేనేం గాజులేసుకుని కూర్చోలేదు'' అంటూ రెచ్చిపోయే వాళ్ళకి గాజులేసుకున్న వాళ్ళని అవమానిస్తున్నామనే అవగాహన, జెండర్‌ అవగాహన ఎప్పటికీ కలుగుతుందో! మహిళలకు సంబంధించి ఒక గౌరవ ప్రదమైన, ప్రజాస్వామికమైన, మానవీయ భాషను, ప్రత్యామ్నాయ పద ప్రయోగాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు మరింత ఎక్కువగా వుందని మార్కండేయ కట్జూ ఉదంతం మన ముందుకు తెచ్చింది.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...